నోటా కంటే తక్కువే !

– అన్ని చోట్లా ఆప్‌ డిపాజిట్లు గల్లంతు
బెంగళూరు : దక్షిణాదిన పాగా వేయాలని అమ్‌ఆద్మీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో నోటాకు 0.69% ఓట్లు రాగా ఆ పార్టీకి అంతకంటే తక్కువగా అంటే 0.58 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఆప్‌ అభ్యర్థిగా గడగ్‌ జిల్లాలోని రాన్‌ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన అనేకల్‌ దొడ్డయ్యకు మాత్రమే గౌరవప్రదమైన ఓట్లు (8,839) లభించాయి. పోలైన 1,78,196 ఓట్లలో ఆయనకు 4.96 % శాతం ఓట్లు వచ్చాయి. బెంగళూరు నగరంలో ఆప్‌ తరఫున బరిలో నిలిచిన ప్రముఖులు బ్రజేష్‌ కాలప్ప, మోహన్‌ దాసరి కూడా చిత్తుగా ఓడిపోయారు. ఆప్‌ మొత్తం 208 మంది అభ్యర్థులను పోటీకి నిలి పింది. అయితే క్షేత్రస్థాయిలో తగిన మద్దతు లేకపోవడం, ప్రజల్లోకి సరిగా వెళ్లలేకపోవడం వంటి కారణాలతో ఓటర్ల ఆదరణ పొందలేక పోయింది. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2.25 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ అభ్యర్థులలో 72 మందికి మాత్రమే వెయ్యి కంటే ఎక్కువ ఓట్లు లభించాయి. పార్టీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరిన కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి కాలప్పకు చిక్‌పేట్‌లో కేవలం 600 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

Spread the love