అల్లరి నరేష్ నటించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మే 3న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు మల్లి మీడియాతో ముచ్చటించారు. ”ఆ ఒక్కటీ అడక్కు’ ఈ కథకు యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా నరేష్‌దే. కేవలం టైటిల్ వరకే తీసుకున్నాం. ఈ కథకు, ఆ సినిమాకు సంబంధం లేదు. పెళ్లి చుట్టూ ఎలాంటి ఎమోషన్స్ వుంటాయి?, కొందరు ఆ ఎమోషన్స్‌ని ఎలా క్యాష్ చేసుకుంటారు? ఇలాంటి అంశాలని చాలా వినోదాత్మకంగా చూపిస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేశాం. ఇందులో ఉండే కంటెంట్‌కి అందరూ కనెక్ట్ అయ్యేలా వుంటుంది. ఇది అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హీరోని పెళ్లి గురించి అందరూ అడుగుతున్నప్పుడు ఆయన సమాధానంగా చెప్పే మాట ‘ఆ ఒక్కటీ అడక్కు’. నిజానికి పెళ్లి గురించి అందరూ చాలా తేలిగ్గా అడిగేస్తారు కానీ.. తీసుకున్నవారు దాన్ని చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ కుటుంబంలో కూడా అదో బాధలా ఉంటుంది. ఇందులో ఆ ఎమోషన్‌ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం. ఇందులోని కామెడీ, ఎమోషన్ ఆడియన్స్‌ని హత్తుకునేలా ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా సందేశంలా ఉండదు. కానీ.. పెళ్లి ఎప్పుడు? అని అడగడం కన్నా మీ దగ్గర ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండనే ఆలోచనని రేకెత్తించేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చూపించే సినిమా కూడా ఇది. నరేష్ ఫస్ట్ హాఫ్ విని ‘ఈ కథ మనం చేసేద్దాం’ అన్నారు. ఆయన క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయి. ఫారియా పాత్ర ఇందులో చాలా కీలకంగా వుంటుంది. కథ ఆమె పాత్ర ద్వారానే మలుపు తిరుగుతుంది. ఫరియాలో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఇందులో తన పాత్రని చాలా అద్భుతంగా చేసింది’ అని చెప్పారు.