అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుపాను

కేరళకు వచ్చేస్తున్న రుతుపవనాలు
బెంగళూరు : కేరళకు రుతుపవనాల రాక ఇప్పటికే ఆలస్యమవగా, ఆ జాప్యానికి తోడు అరేబియా సముద్రంలో బుధవారం తుపాను ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ తుపాను ఉధృతి, సముద్రంలో ఏర్పడే ప్రాంతం, తదనంతరం దాని కదలికలు ఇవన్నీ కూడా కేరళకు నైరుతి రుతుపవనాల రాకను ప్రభావితం చేసే అవకాశం వుందని పేర్కొంది. ప్రస్తుతమున్న ఆవర్తన పరిస్థితులు క్రమంగా అల్పపీడనంగా రూపుదిద్దుకుంది, మంగళవారం ఉదయానికి, ఇది మరింత బలపడి, ఆగేయ అరేబియా సముద్రంలో కేంద్రీకృతమయ్యే అవకాశాలు వున్నాయి, ప్రస్తుతం ఈ అల్పపీడనం ముంబయికి దక్షిణ-నైరుతిలో 1120కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇప్పటికి వున్న అంచనాల ప్రకారం ఇది పాకిస్తాన్‌కు తూర్పు దిశగా వెళుతోందని, భారత పశ్చిమ తీర ప్రాంతాన్ని ప్రభావితం చేయబోదని ఐఎండీ పేర్కొంది. అయితే రాగల 24గంటల్లో ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారగలదని భావిస్తున్నారు. వారం రోజుల నుంచి రుతుపవనాలు ముందుకు పురోగమించడానికి వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా వున్నాయి, కేరళ తీర ప్రాంతంపై మేఘాలు దట్టంగా ఏర్పడినట్టు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి, రుతుపవనాలు బలపడుతున్నాయని ఐఎండీ సీనియర్‌ అధికారి తెలిపారు.

Spread the love