కేకే..కాక..

– కారు దిగేందుకు రంగం సిద్ధం
– రేపు హస్తం గూటికి
– ఇదే విషయాన్ని అధినేతతో చెప్పిన ఎంపీ
– ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ -వాగ్వాదం
– పలు అంశాలను ప్రస్తావిస్తూ గులాబీ బాస్‌కు లేఖ
– ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్‌
– పదవులు అనుభవించి పార్టీ మారతానంటే ఎలా అంటూ ప్రశ్నలు
– కాంగ్రెస్‌ నా సొంతిల్లు-అందులోనే చస్తానంటూ కేకే సమాధానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఒక సర్పంచో, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో కాదు.. ఏకంగా పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నేతే… నేనిక్కడుండలేను, బయటకు వెళ్లిపోతా…’ అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సిచ్యుయేషన్‌ అలాగే తయారైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిట్టింగ్‌ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న వేళ… బీఆర్‌ఎస్‌కు ఢిల్లీలో పెద్ద దిక్కు, ఏకంగా పార్లమెంటరీ పార్టీ నేత అయిన కేకే (కే.కేశవరావు) కూడా గుడ్‌ బై చెబుతున్నానంటూ కుండబద్ధలు కొట్టటంతో గులాబీ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. సాక్షాత్తూ బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌కే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘మీకు పార్టీలో అత్యున్నతమైన సెక్రెటరీ జనరల్‌ పదవినిచ్చాం, రెండుసార్లు రాజ్యసభకు పంపాం, మీ కూతురికి హైదరాబాద్‌ మేయర్‌ పదవిని కట్టబెట్టాం. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు..? కష్ట కాలంలో పార్టీని వీడటం సరికాదు…’ అంటూ గులాబీ బాస్‌ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కేకే తన పట్టును వీడలేదు. దీంతో ఆయనపై కేసీఆర్‌ తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ’84 ఏండ్ల వయసులో పార్టీ మారి ఏం చేస్తావ్‌…’ అంటూ సీరియస్‌ అయ్యారు. ప్రతిగా ‘కాంగ్రెస్‌ నా సొంతిల్లు. ఆ పార్టీతో ఎన్నో ఏండ్ల అనుబంధముంది. నేను అందులోనే చస్తా…’ అంటూ కేకే ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ వాదనలకు, వాగ్వాదాలకు ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ గురువారం వేదికైంది.
ఇటీవల కేకే యూట్యూబ్‌ ఛానళ్లలో బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి విదితమే. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమవుతుందంటూ ఆయన ఆ సందర్భంగా కామెంట్‌ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్‌…కేకేను గురువారం తన ఫామ్‌హౌస్‌కు పిలిపించుకున్నారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయని తెలిసింది. ‘మీకు, మీ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసింది..? పదేండ్లపాటు పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వీడతామంటే ఎలా…?’ అంటూ కేసీఆర్‌, కేశవరావును బుజ్జగించేందుకు ప్రయత్నించారని సమాచారం. పార్టీ మారటమనేది కరెక్టు కాదనీ, ఆ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కేకేకు సూచించారు.
అయినా మెత్తబడని కేశవరావు… అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి గల కారణాలను ఏకరువు పెట్టారు. కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల వైఖరి, వ్యవహారశైలి వల్ల పార్టీ క్రమక్రమంగా ప్రజలకు దూరమైందని స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రస్తుతం పార్టీ పరిస్థితి, దాని వైఫల్యాలు, లోక్‌సభ ఎన్నికల్లో బలాబలాలు, తాను పార్టీ మారటానికి గల కారణాలను పేర్కొంటూ ఆయన కేసీఆర్‌కు ఒక లేఖ సమర్పించినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు వివరించాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌, కాళేశ్వరంలో అవినీతి, పార్టీ ఫిరాయింపులను కేసీఆర్‌ ప్రోత్సహించటం, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను అవమానించటం, దుర్భాషలాడటం తదితరాంశాలను ఆయన అందులో ప్రస్తావించారు. తన రాజకీయ అనుభవాన్ని, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను కూడా ఆయన స్పష్టంగా లేఖలో వివరించారు. ఆ లేఖపై కూడా కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘పార్టీ పరిస్థితి మీరనుకున్నట్టుగా లేదు…’ అంటూ ఆయన సీరియస్‌ అయ్యారు. కేసీఆర్‌ ఈ రకంగా స్పందిస్తుండగానే… తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్టు కేకే స్పష్టం చేశారు. ఇదే విషయమై కేసీఆర్‌ మాట్లాడుతుండగానే, ఆయన మధ్యలోంచే బయటకు వచ్చేశారు. ఎర్రవెల్లి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న కేకే… అక్కడ అప్పటికే వేచి ఉన్న మీడియా ప్రతినిధులపై కస్సుబుస్సులాడారు. ‘నన్ను విజువల్స్‌ తీసుకోండి…’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, గడ్డం అరవింద్‌రెడ్డి తదితరులు కేకే ఇంటికి వచ్చారు. ఈనెల 30న హైదరాబాద్‌ మేయర్‌, కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్న సంగతి తెలిసిందే. అదే రోజు కేకేతోపాటు ఇంద్రకరణ్‌, గడ్డం అరవింద్‌ కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
కేసీఆర్‌తో చర్చించిన పలు అంశాలపై కేకే గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన కూతరు, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ… అధి కార పార్టీలో ఉంటేనే పనులవుతాయి, ప్రజా సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని వ్యాఖ్యా నించారు. అందుకే తాను కాంగ్రెస్‌లో చేరబోతు న్నట్టు వెల్లడించారు. కాగా కేకే కుమారుడు విప్లవ్‌ కుమార్‌ మాత్రం తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేయటం గమనార్హం.

Spread the love