న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రోజు రోజుకు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ధనవంతులు ప్రయాణించే విమానయాన ఇంధన ధరలను మాత్రం భారీగా తగ్గిస్తోంది. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలకు 7 శాతం కోత పెడుతూ గురువారం చమురు మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కిలోలీటర్ ఎటిఎఫ్‌పై రూ.6,632.25 తగ్గించి రూ.89,303గా నిర్ణయించింది. దీంతో వరుసగా నాలుగు నెలల్లోనూ ఈ ఇంధనం ధర తగ్గించినట్లయ్యింది. ఇంతక్రితం మార్చిలో 4 శాతం, ఏప్రిల్‌లో 8.7 శాతం, మేలో 2.45 శాతం చొప్పున ఎటిఎఫ్ ధరలకు బిజెపి ప్రభుత్వం కోత పెట్టింది. ప్రతీ నెల ఒక్కటో తేదిన ఎటిఎఫ్ ధరలను కేంద్రం సమీక్షిస్తుంది. తాజాగా వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.83.5 తగ్గించింది. దీంతో ఢిల్లీలో ఆ సిలిండర్ ధర రూ.1,773గా ఉంది. మరోవైపు గృహాల కోసం ఉపయోగించే గ్యాస్ ధరను మాత్రం యథాతథంగా కొనసాగించడం గమనార్హం.