నవతెలంగాణ-కాటారం
కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర మంగళవారం బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సడవలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, కిశోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయి 12.5 శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని, 14 సంవత్సరాలు పైబడిన బాలికలు సర్వికల్ క్యాన్సర్ నివారణపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్యాంప్‌కు హాజరై పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
సఖి సెంటర్ ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ, కిశోర వయస్సులో సరైన మార్గదర్శకత ఎంతో ముఖ్యమని తెలిపారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. అనవసర ఆకర్షణలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని, సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు లేదా బాధ్యత గల వ్యక్తులతో పంచుకోవాలని చెప్పారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. అవసరమైనప్పుడు 1098, 181, 100 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని వివరించారు.
సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ, కిశోర బాలికలు చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పల్లీ పట్టి వంటి పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ఏపీఎం రవికుమార్, సఖి ప్రతినిధి గాయత్రి, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, కిశోర బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



