నవతెలంగాణ – కర్నూలు: మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విచారణకు హాజరవకుండా తప్పించుకుంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధమైంది. అవినాష్ రెడ్డి నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద ఉంటుండడంతో సీబీఐ అధికారులు, పోలీసులు సోమవారం ఉదయమే అక్కడకు చేరుకున్నారు. అవినాష్ అరెస్టుపై కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఆస్పత్రి గేటు వద్ద వైసీపీ శ్రేణులు మోహరించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను వెనక్కి పంపుతున్నారు. కాగా తల్లి శ్రీలక్ష్మీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి అవినాష్ రెడ్డి అక్కడే ఉంటున్నారు.