జననివాసాల మధ్య సెల్‌ఫోన్‌ టవర్లు

– నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు
నవతెలంగాణ-మాడుగులపల్లి
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని తోపుచర్ల గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ ఫోన్‌ టవర్లు ఆయా సంస్థల యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామంలో అంతకుముందు జియో టవర్‌ ఉన్నప్పటికీ అదే స్థలంలో ఎయిర్టెల్‌ సంస్థ వారు మరొక నూతన సెల్‌ ఫోన్‌ టవర్‌ను నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయమై నవతెలంగాణ ప్రతినిధి ఆదివారం అక్కడ ఉన్న వారిని ఈ సెల్‌ ఫోన్‌ టవర్‌ వల్ల రేడియేషన్‌ వ్యాపించి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదంఉంది కదా అని అడగగా వారు ప్రమాదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేటువంటి అప నమ్మకమైన మాటలు చెప్పారు. ఇలా జనావాసాల మధ్య కాకుండా ఎక్కడైనా ఊరి బయట టవర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఈ విషయం గురించి మేము ఎవరికీ ఫిర్యాదు చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ ఫోన్ల వాడకం ఎక్కువ కావడం వల్ల నెట్‌వర్క్‌ సంస్థల వారు ఎక్కడ పడితే అక్కడ టవర్లు ఏర్పాటు చేయడం అనేది సరైంది కాదని, ఊర్లో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టవర్లు ఏర్పాటు చేస్తే బావుంటుందని గ్రామ ప్రజలు అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇకనైనా సదరు అధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టిసారించి తగు న్యాయం చేయగలరని ప్రజలు కోరుతున్నారు.

Spread the love