చల్లబడ్డ వాతావరణం

– దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వాన
– నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌లో 7.38 సెంటీమీటర్ల భారీ వర్షం
– వచ్చేరెండ్రోజులకు వర్షసూచన
– ఉష్ణోగ్రతలూ పెరిగే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నాలుగైదు రోజులతో పోల్చిచూస్తే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీల మేర తగ్గాయి. అయితే, ఉక్కపోత మాత్రం యథాతథంగా ఉంది. మంగళవారం రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌లో అత్యధికంగా 7.38 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డయింది. మంగళవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 170కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 40 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అయితే, వచ్చే రెండురోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Spread the love