నవతెలంగాణ-మధిర
అకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని సిఐటియు జాతీయ నాయకులు ఎమ్ సాయిబాబా, సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర మార్కెట్ యార్డు నందు అకాల వర్షం వల్ల తడిసిన మొక్కజొన్నలను వడ్లను కల్లాల వద్దకు వెళ్లి పరిశీలించి అక్కడ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తేమ పేరుతో వడ్లను కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షం వల్ల వడ్లు తడిచాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగానే ఏర్పాటు చేశారని ఆ కేంద్రాల ద్వారా కొనుగోలు సక్రమంగా జరగట్లేదని తెలిపారు. మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేసినట్లయితే రైతులు నష్ట పోయేవాళ్ళు కాదని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి తడిసిన మొక్కజొన్నలను వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్, శీలం నరసింహారావు, పడకండి మురళి మండవ ఫణీంద్ర కుమారి మద్దాల ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు.