కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఉపాధి చట్టం

– వ్యవసాయ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న కేంద్రం
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు
నవతెలంగాణ- కూసుమంచి
దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు, శ్రమజీవులకు ఉపాధి హామీ చట్టం ద్వారా పని చేస్తున్నారంటే అది కమ్యూనిస్టు పార్టీల పోరాట ఫలితమే అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పద్మా రెడ్డి భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు నియోజకవర్గస్థాయి సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ … 2004లో యూపీిఏ ప్రభుత్వంలో చట్ట సభల్లో ఎక్కువ సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉండటంతో ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీల కృషితో 2005లో ఉపాధి హామీ చట్టం రూపొందించబడిందని తెలియజేశారు. నేడు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ చట్టానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం రెండు లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్‌ కేటాయిస్తే నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 63 వేల కోట్లను మాత్రమే బడ్జెట్‌ కేటాయించింది, ఈ బడ్జెట్‌ తో సంవత్సరంలో పని దినాలు తగ్గటంతో పాటు, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర దాగుందని ఈ కుట్రని ప్రజలు, వ్యవసాయ కార్మికులు, గుర్తించి రానున్న కాలంలో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఈ చట్టం రద్దు అయితే ఉపాధి దొరకటం కూడా కష్టం అవుతుందని, దీంతో కార్మికుల జీవన పరిమాణాలు తగ్గిపోతాయని, దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తాయని భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు తల వంచి, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మి, కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ… ఉపాధి హామీ జరిగే ప్రదేశాలలో కార్మికులకు రక్షణ చట్టాలను అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస మౌనిక సదుపాయాలను కల్పించాలన్నారు. కూలీ రూ.272 ఇస్తూనే రోజుకి మరో 600 రూపాయల వేతనం వచ్చే విధంగా చట్టాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో కర్ణాకర్‌ రెడ్డిని కలిసి ఉపాధి హామీ చట్టంలో కార్మికులకు రక్షణ కల్పించాలని, పని దినాలు పెంచాలని, ఉపాధి కూలీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు చిట్టూరి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు వడ్లమూడి నాగేశ్వరరావు, కూసుమంచి మండల కార్యదర్శి మూడు గన్యా నాయక్‌, తిరుమలాయపాలెం మండల కార్యదర్శి అంగిరేకుల నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శీలం గురుమూర్తి, కందుల బాబు, కర్ణబాబు, అజ్మీర సైదులు, హలవత్‌ బాసు నాయక్‌, తాళ్లూరి వెంకటేశ్వర్లు, బద్రు, వీరస్వామి కందుల బాబు, బి శ్రీనివాస్‌, వెంకన్న, పాల్గొన్నారు.

Spread the love