కార్మిక వర్గ ఐక్యతకు కేంద్ర బిందువు సీఐటియు

– కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు
– దేశంలో కార్మిక వర్గ ఐక్యతకు బాటలు వేసింది సీఐటియు
– ఖమ్మంలో ఘనంగా సీఐటియు ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-ఖమ్మం
భారతదేశంలో కార్మిక వర్గ ఐక్యతకు కేంద్ర బిందువు సిఐటియు అని, అనేక కార్యక్రమాల ద్వారా కార్మిక సంఘాల్ని ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషించిందని సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మా విష్ణువర్ధన్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో వివిధ కార్మిక సెంటర్లలో సిఐటియు జెండాని ఆవిష్కరించి అనంతరం ఖమ్మంలోని ఎఫ్‌సిఐ గోడౌన్లో కార్మికులతో సభ నిర్వహించారు. ఈ సభలో వారు మాట్లాడుతూ 1970లో భారతదేశంలో కార్మికుల ఐక్యత కోసం ఏర్పడింది. సిఐటియు నాటి నుండి నేటి వరకు భారతదేశంలో కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మందబలంతో రద్దుచేసి కార్మిక వర్గాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే ఈ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో కార్మిక వర్గం మరింత సంఘటితం కావాల్సిన అవసరం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. కేంద్ర అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కార్మిక వర్గం చైతన్యం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్మిక వర్గ ఐక్యతని పాలకవర్గం నిరంతరం విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుందని ,ఈ ప్రమాదాన్ని కార్మిక వర్గం ఎప్పటికప్పుడు గమనిస్తూ మరింత ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాజకీయాల కతీతంగా కార్మిక వర్గ ఐక్యత కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌, జిల్లా ఉపాధ్యక్షులు బండారు యాకయ్య, జిల్లా నాయకులు భూక్య శ్రీనివాస్‌, ఎర్ర మల్లికార్జున్‌, మల్లారెడ్డి, టి లింగయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love