కారణం చెప్పకుండానే కోతలు విధిస్తున్నారు

– కొంజేటి రమేష్ రైతు గోవిందరావుపేట
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైస్ మిల్లు యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన కొంజేటి రమేష్ ఆవేదనతో చెప్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రమేష్ మీడియాతో మాట్లాడుతూ రైతుగా తన బాధలను చెప్పుకున్నారు. తనతో పాటు మరో ఇద్దరు రైతులకు చెందిన ధాన్యం 288-80 క్వింటాళ్ల ధాన్యాన్ని మల్లంపల్లిలోని అచ్యుతానంద ఇండస్ట్రీస్ అనే బిల్లుకు తరలించగా ఏలాంటి కారణం లేకుండా ఐదు క్వింటాళ్ల అరవై కిలోలను ధాన్యం తరుగు తీసి వేయడం జరిగిందని రమేష్ ఆవేదనగా తెలిపారు. వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని పరిశీలించి అనుమతి ఇచ్చిన పిదపనే కొనుగోలు కేంద్రం వారు శుభ్రమైన ధాన్యాన్ని కాంట వేయించి లారీతో తరలించడం జరిగిందన్నారు. ఐదు క్వింటాళ్ల 80 కిలోలు ఎందుకు తరుగు వచ్చిందని మిల్లు యాజమాన్యాన్ని అడిగితే రైతుకు చెప్పాల్సిన అవసరం మాకు లేదని కొనుగోలు కేంద్రంలో అడగాలని మొండి గా సమాధానం చెబుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఈ విషయమై అడిగితే తమకేమీ తెలియదని అంటున్నారు. ధాన్యాన్ని పరిశీలించిన రిపోర్టు కూడా ఏమీ లేకుండా ఎలా తరుగు తీశారని రైతు రమేష్ అంటున్నారు. మిల్లర్లు ఇస్తారాజ్యంగా తరుకుతీస్తున్నారని పట్టించుకునే అధికారి లేడని వాపోతున్నాడు. ఈ విషయమై ఇప్పటికైనా అధికారులు కలగజేసుకొని సమస్యలు పరిష్కరించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నానని అన్నారు. ఇలాంటి సమాచారం లేకుండా ఐదు గంటల 60 కిలోలను తరుగు చేయడం ద్వారా సుమారు పదివేలపైన రూపాయలను నష్టపోతున్నామని అన్నారు. నాలాగా ఎందరో రైతులు ఈ కోవలో ఉన్నారని ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుందని అన్నారు.

Spread the love