ఉత్తమ వైద్యాధికారిక డాక్టర్ సుకుమార్..

నవతెలంగాణ – గోవిందరావుపేట్
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ సుకుమార్ ఉత్తమ వైద్యాధికారిగా బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైద్య ఆరోగ్య దినోత్సవం రోజున డాక్టర్ సుకుమార్ ఈ అవార్డును అందుకున్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన సండ్రగూడెం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన డాక్టర్ సుకుమార్ వైద్య విద్యను అభ్యసించి సొంత మండలంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం పూర్వజన్మ సుకృతంగా పేర్కొంటారు. ఇలాంటి అవకాశం అందరికీ రాదని ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రజలకు వైద్య సేవలు అందించడం నిజంగా దేవుడు ఇచ్చిన వరంగా డాక్టర్ సుకుమార్ చెబుతారు. సుదీర్ఘకాలంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన వైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సుకుమార్ ప్రజలకు చిన్నతనం నుండి సుపరిచితులు. ఆసుపత్రికి వచ్చే వారిని ఎంతో ఆప్యాయతగా పలకరింపుతో వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారానికి మార్గం చూపుతారు. విధుల్లో ఉన్న సమయంలో వైద్య సేవలు అందించడమే కాకుండా డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ప్రజలు వైద్యపరంగా ఎలాంటి సందేహాలు అడిగిన నివృత్తి చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభిమానాన్ని చురగొన్నారు. డాక్టర్ సుకుమార్ ఉత్తమవైద్యాధికారిగా ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సేవలు గుర్తించినందున అవార్డుకు ఎంపిక చేశారని పలువురు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఉత్తమ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అవార్డు తీసుకున్న సందర్భంగా ఆయన వేదికపైన ఉన్న పెద్దలందరికీ, శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Spread the love