పగటి నక్షత్రాలు !..

పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే.
ఆకాశమే హద్దుగా ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఇతర పక్షులు, ప్రకతి సోయగాలు, కార్టున్‌ బొమ్మల కైట్‌లు ఆకట్టుకుంటున్నాయి. రాత్రుళ్లు కూడా గాలి పటాలు ఎగరేస్తారు. వెలుగులు నింపుకున్న పతంగులు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి.
1754లో బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ ఆకాశంలోని విద్యుత్‌ గురించి తెలుసుకునేందుకు పతంగులను వాడాడట.
ఢిల్లీ ‘దర్వాజా’ కూడా పతంగుల మార్కెట్‌కు పేరు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులు పతంగుల క్రీడను బాగా ప్రోత్సహించే వారట.
క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్‌ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. ‘హేన్‌ చక్రవర్తి’కి వచ్చిన ఉపాయమే తొలి గాలిపటం.
సుమారు 400 సంవత్సరాల పూర్వం అమెరికాలోని టరెంటం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌కే తొలిసారి పతంగిని ఆవిష్కరించినట్టు చరిత్ర చెప్తోంది.
జపాన్‌లో 5నుంచి 8 అడుగుల పతంగులను ఎగురువేస్తారట. కొన్ని పతంగుల బరువు 200 కిలోలదాకా ఉంటుందిట.
పావురాళ్లు, కంచర గాడిదలు మొదలైన వాటి ద్వారానే కాకుండా పూర్వం పతంగుల ద్వారానూ తపాలా సేవలు కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది.
1870లో లారెన్స్‌ హర్‌గ్రీవ్స్‌ అనే శాస్త్రజ్ఞుడు ‘బాక్స్‌ కైట్‌’ ను సిద్ధం చేసి అందులో వైజ్ఞానిక పరికరాలను అమర్చి, తద్వారా ఎన్నో పరిశోధనల్ని నిర్వహించారు.
19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జతచేసి ఎంతో ఎత్తుకు ఎగురవేసి, పై నుంచి భూమి ఫొటోలు తీశారు..
థారులాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే ’78 రకాల నిబంధనలు’ పాటించాల్సి ఉంటుంది.
బెర్లిన్‌ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం వుండడంతో భారీ పతంగులను తూర్పు జర్మనీలో నిషేధం విధించారు.
గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు.
ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి వారం ఒక కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనైతే సంక్రాంతి రోజున ఏకంగా అంతర్జాతీయ పతంగుల పండగే జరుగుతుంది
పతంగుల మ్యూజియం కూడా ఉంది. జమ్మూ కశ్మీర్‌లో రాఖీ పౌర్ణమికి గాలిపటాలు ఎగరేస్తుంటారు.
అయితే పతంగులు ఎగరేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే భవనాలు, మిద్దెలు, సగం నిర్మించిన గోడమీద నుండి పతంగులు ఎగరేసే వారు, వాటిని పట్టుకునే యత్నంలో ప్రమాదవశాత్తూ కింద పడే ప్రమాదముంది. విద్యుత్‌ తీగలమీద పడిన గాలిపటాలను తీసేందుకు ప్రయత్నం చేయరాదు. గాలిపటాలకు వాడే మాంజా పక్షుల కాళ్లకు చుట్టుకుని చనిపోతున్నాయి.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి.
8088 577 834

Spread the love