ప్రజాస్వామ్యమా… రాజద్రోహమా..?

ఆంగ్ల పాలకులు భారతీయుల పోరాటాన్ని అడ్డుకోవడానికి, స్వేచ్ఛను నులిమివేయడానికి ఆనాడు రాజ ద్రోహ చట్టం తీసుకొస్తే నేడు మోడీ హయాంలో ప్రజల కోసం గొంతెత్తు తున్న వారిపై చట్టవ్యతిరేక నిరోధ కార్యకలాపాల చట్టం ‘ఊపా’ ద్వారా అనేక మందిని నిర్బంధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కిందట జరిగిన ఘటనపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు 152మందిపై కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిది. దీనిపై ప్రజల నుంచి, సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరగోపాల్‌ మీద పెట్టిన ‘ఊపా’ను కొట్టివేయాలని డీజీపీని ఆదేశించారు. అంతవరకు బాగానే ఉన్నా కేంద్రం నుంచి మొదలుకుంటే రాష్ట్రం వరకు రాజద్రోహ చట్టం అమలు కావడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలతో పాటు విమర్శల జడివాన కురుస్తోంది. రాజద్రోహ చట్టం ఆవశ్యకతను సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడం కూడా మంచి పరిణామమే. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన కూంబింగ్‌ సందర్భంగా దొరికిన డైరీల్లో హరగోపాల్‌తో పాటు 152మంది పేర్లు ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం నాలుగు రోజుల వరకు కూడా బయటకు పొక్కలేదు. అసలు ‘ఊపా’ చట్టం కింద కేసు పెట్టాల్సినంత తప్పు హరగోపాల్‌ ఏంచేశాడని? ఇది నిర్బంధం కాకుంటే మరేమిటి? ప్రజల తరపున పోరాడటం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడం ఆయన చేసిన నేరమా? ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని సంధిస్తున్న ప్రశ్నలివి.
హరగోపాల్‌ గత ఐదు దశాబ్దాలకుపైగా వివిధ విశ్వ విద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేయడమే కాకుండా ప్రస్తుతం అనేక విశ్వవిద్యాలయాలలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రాజకీయ శాస్త్రం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం మానవ హక్కుల దాకా విద్యా ప్రయాణం కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నుంచి బెంగళూరు నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా దాకా ఆయన సందర్శక ఆచార్యులుగా వ్యవహరించడమే కాదు సివిల్‌ సర్వీస్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారులకు కూడా మానవ విలువలు బాధ్యతలు హక్కుల పట్ల శిక్షణ ఇచ్చిన సందర్భాలు ఎన్నో. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక పాత్ర నిర్వ హించడంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా జలసాధన ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన హరగోపాల్‌ అన్ని రాజకీయ పక్షాలతో పాటు పౌరసమాజంచే గౌరవించ పడే స్థాయిలో ఉన్న ప్రధానమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాజశేఖర్‌రెడ్డి కాలంలో నక్సలైట్లతో చర్చల సందర్భంగా కూడా క్రియాశీలక పాత్ర పోషించి శాంతిని పరిరక్షించాలని తపనతో ఆరాటపడిన హరగోపాల్‌ ఏ రకంగా నేరస్తుడు, ఉగ్రవాది, తీవ్ర వాది అవుతాడో పాలకులే తేల్చాలి. అనేక సందర్భాలలో ఆయన సలహాలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిన విషయం తెలిసిందే. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేధావుల సలహా మండలి ఏర్పాటు చేసి ఆ సలహా మండలి పర్యవేక్షణలో ప్రభుత్వం పని చేస్తుందని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించినట్లు, ఆ బృందానికి నాయకత్వం వహిం చాలని హరగోపాల్‌ను కోరినట్లు కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ప్రజల పక్షాన మాత్రమే పని చేయడానికి తాను సిద్ధమని ఆ పదవిని నిరాకరించడం చూస్తే త్యాగం, సేవ, ప్రజాదృక్పథం పట్ల ఆయన పోరాటశైలి తెలుస్తున్నాయి కదా! దీన్ని బట్టి చూస్తే గనుక ఆయన ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న మేధావిగా గుర్తించింది తెలంగాణ సమాజం. అలాంటి వ్యక్తిపై ‘ఊపా’ చట్టం కింద కేసు నమోదుకావడం ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. రాష్ట్రంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు లేవు. నిరసన ప్రదర్శనలు తెలియజేయడానికి పోలీసుల అనుమతి తీసుకోవలసి వస్తున్నది. హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగటానికి ఉద్యమాలు అనివార్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ప్రజల హక్కుల పరిరక్షణలో మేధావులు, విద్యా వంతులు, హక్కుల కార్యకర్తల సలహాలు, సహకారాలను తీసు కుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. ఇప్పటికే దేశంలో మత విద్వేషాలతో పాలన జరుగుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపాధ్యాయులు, మేధావులు, కళాకారులు, విద్యావంతుల సహకారం అవసరం. ప్రజా సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్న ప్రజలు హర్షిస్తారు. కానీ అంతకన్నాముందు ప్రజాస్వామ్య వాతావరణంలో, ఉన్నతమైన ఆకాంక్షలు, ఆశయాలను సాధించు కునే క్రమంలో రాష్ట్రంలో విశాల ప్రాతిపదిక పైన చర్చలు జరగాలి. అఖిల పక్షాలతో సమావేశాలు నిర్వహించాలి. విద్యా వంతులు, మేధావుల సలహాలను తీసుకొని వినూత్న పరిపాలన చేయాలి.రాజద్రోహ చట్టంపై వ్యతిరేకత తెలపడంతో పాటు కేం ద్రానికి ఈ చట్టం అమలు చేయబోమని సంకేతాలివ్వాలి. లేదంటే ప్రజాస్వామ్యంలో రాజ్యద్రోహానికి పాల్పడిన వారిలో మొదటి ముద్దాయి ఈ ప్రభుత్వమే అవుతుంది. ఇప్పటి వరకు ఈ చట్టం కింద కేసులు బనాయించబడి శిక్ష అనుభవి స్తున్న వారిపై భేష రతుగా ఆ కేసులను ఉపసంహరించుకుని వారి విడుదల చేస్తే నిజమైన ప్రజాస్వా మ్యాన్ని అమలు చేసినట్టవుతుంది. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే విషయం గమనంలో పెట్టుకోవాలి.

వడ్డేపల్లి మల్లేశం
9014206412

Spread the love