ఆశాలకు అర్హత ‘పరీక్ష’ రద్దు చేయాలి

– వేతనం రూ.18వేలు ఇవ్వాలి
– సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు, అధికారులకు వినతి
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని, వేతనం రూ.18వేలకు పెంచాలని, పరీక్ష నిర్వహణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆశా వర్కర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ర్యాలీలు తీసి.. మెడికల్‌ ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు.నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పతి ఆవరణలో ఆశాలు నిరసన చేశారు. అనంతరం డాక్టర్‌ ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ బల్మూరు మండల కార్యదర్శి ప్రమోదమ్మ డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకొటలో సీఐటీయూ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్‌, ఆత్మకూరులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల ముందు ధర్నా చేశారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ యాస్మిన్‌కు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో, లైన్‌వాడలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు. సీఐటీయు హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని పాతబస్తీలో యుపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు సౌత్‌ జిల్లా అధ్యక్షులు ఎం.మీనా మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు ఎగ్జామ్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు రూ.18 వేతనం ఇవ్వాలని కోరారు. జిల్లా ఆస్పత్రిలో ఆశాలకు రెస్ట్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆశా వర్కర్లకు రూ.18,000 వేతనం చెల్లించాలని ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ సీహెచ్‌ సీ, ఈజ్‌గాం పీహెచ్‌సీలో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ సీతారాంకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఆశా వర్కర్లకు పనిభారం విపరీతంగా పెరిగిందని, పారితోషికాలు లేని అనేక పనులను ప్రభుత్వం ఆశాలతో చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పాల్వంచ ప్రధాన సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు. ఖమ్మం జిల్లా వైరాలో సీఐటీయు ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేశారు. అనంతరం వైద్యాధికారి ఉదయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. తల్లాడలో పీహెచ్‌సీలో డాక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఆశాలతో వెట్టిచాకిరీ చేయించుకోవడం ఆపాలని, కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. పారితోషికం లేని అదనపు పనులు చేయించొద్దని, అర్హత పరీక్షను రద్దు చేయాలని కోరారు. నిజామాబాద్‌ నగరంలోని యూహెచ్‌సీ, బోధన్‌, వర్నితో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌, బాన్సువాడలో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

Spread the love