వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి చొరవచూపిన..

– తమ్మినేనికి కృతజ్ఞతలు తెలిపిన వీఆర్‌ఏ జేఏసీ
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రవ్యాప్తంగా 80 రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె చేసి, రెగ్యులరైజేషన్‌, ఇతర పెండింగ్‌ సమస్యలు సాధించుకున్న వీఆర్‌ఏలకు అండగా నిలబడిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వీఆర్‌ఏ జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో తమ్మినేనిని కలిసిన వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు.. అయన్ని శాలువాతో సన్మానించి, బోకే ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ కో చైర్మెన్‌ రమేష్‌ బహుదూర్‌, సెక్రెటరీ జనరల్‌ ఎస్కే దాదేమియా మాట్లాడుతూ.. వీఆర్‌ఏల పోరాటంకు మొదటి నుంచి అండగా నిలబడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మూడు దఫాలుగా బహిరంగ లేఖలు ముఖ్యమంత్రికి రాశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అధికారులు, మంత్రుల దృష్టికి తమ సమస్యను తీసుకుపోయి పరిష్కారం చేయడానికి తమ్మినేని చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. వీఆర్‌ఏల సమ్మె పోరాటం జరిగినన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మాకినేని బసవపున్నయ్య భవనాలు తమ పోరాటానికి, సభలు సమావేశాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి, పోరాటానికి అండ దండ కల్పించిన సీపీఐ(ఎం)కు రాష్ట్రంలో ఉన్న 23,000 మంది వీఆర్‌ఏలు రుణపడి ఉన్నారని తెలిపారు.ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. వీఆర్‌ఏల అన్ని సంఘాలు ఐక్యమై జేఏసీగా ఏర్పడి సమరశీలంగా పోరాటం చెయ్యటం ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి వారి సమస్యలు పరిష్కరించిందని తెలిపారు. నూతన సెక్రటేరియట్‌లో మొదటి క్యాబినెట్‌ సమావేశంలో వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్‌ ప్రకటించటం హర్షించదగినదన్నారు. వెంటనే వీఆర్‌ఏలకు క్యాబినెట్‌ నిర్ణయం ప్రకారం జీవోలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ్మినేనిని కలిసిన వారిలో వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్‌ వంగూరు రాములు, ఎస్‌ కే రఫీ, మాధవ నాయుడు, సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు వై విక్రం, రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, ఖమ్మం జిల్లా వీఆర్‌ఏ జేఏసీ చైర్మెన్‌ అజీజ్‌ ఖాన్‌, భరత్‌ జానీమియా తదితరులు ఉన్నారు.

Spread the love