బెంగాల్‌లో ఉపాధి హామీ దూరం కోటి సంతకాలతో

– ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో ఏడాదిగా గ్రామీణ పేదలు ఉపాధి హామీకి దూరమయ్యారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి, అరాచకత్వానికి తోడు కేంద్ర ప్రభుత్వ ద్రోహం వల్ల కోట్లాది మంది బెంగాల్‌ గ్రామీణ పేదలు ఉపాధి హామీని కోల్పోయారని విమర్శించారు. బెంగాల్‌లో ఉపాధి హామీ పనులు, గ్రామీణ పేదల స్థితిగతులను పరిశీలించేందుకు ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, బెంగాల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుషార్‌ ఘోష్‌ నాయకత్వంలోని బృందం సోమవారం అనేక గ్రామాల్లో పర్యటించింది. ఉపాధి హామీ పనులు లేక, ఇతర పనులేమీ లభించక, వలసలుపోలేక జీవనం కడు దుర్భరంగా మారిందని బృందానికి గ్రామీణ పేదలు చెప్పుకున్నారని వెంకట్‌ తెలిపారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని అడిగిన పేదలందరికీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి విరుద్ధంగా ఏడాది కాలంగా బెంగాల్‌లో పేదలకు ఉపాధి హామీని దూరం చేశారని అన్నారు. బెంగాల్‌లో మూడు కోట్ల మందిపైగా ఉపాధి హామీ కూలీలు ఉన్నారని, వారికి వంద రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. పని కల్పించలేక పోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చట్టం చెబుతున్నదనీ, ఆ చట్టాన్ని చాప చుట్టే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని విమర్శించారు. గత ఏడాది క్రితం ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు రూ. 5,520 కోట్లకుపైగా ఉపాధి బకాయిలు ఉన్నాయనీ, నిజమైన లబ్దిదారులకు ఏడాది కాలంగా ఈ డబ్బులు అందక నిస్సహాయ స్థితిలో పేదలు ఉన్నారని తెలిపారు.

Spread the love