వెల్లివిరిసిన క్రీడోత్సాహం

– ఉత్సాహంగా సిఎం కప్‌ పోటీలు
– ఆరు వేదికల్లో శాట్స్‌ చైర్మెన్‌ పర్యవేక్షణ
నవతెలంగాణ-హైదరాబాద్‌
సిఎం కప్‌ 2023 పోటీలతో క్రీడోత్సాహం వెల్లివిరిసింది. 18 క్రీడాంశాల్లో 33 జిల్లాలు తలపడుతున్న తెలంగాణ క్రీడా సంగ్రామంలో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, బాక్సింగ్‌, ఆర్చరీ, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, హ్యాండ్‌బాల్‌, టెన్నిస్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌ క్రీడాంశాల్లో పోటీలు తుది దశకు చేరుకోవటంతో పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, షూటింగ్‌ క్రీడాంశాల్లో మంగళవారం కొన్ని విభాగాల్లో తుది పోటీలు జరిగాయి. పతక పోటీలకు హాజరైన శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ విజేతలను అభినందించి, ప్రశాంస పత్రాలు అందజేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ మంగళవారమే పతక పోటీలు నిర్వహించారు.
నేడు చివరి రోజు : సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం మొదలైన సిఎం కప్‌ పోటీలకు బుధవారం చివరి రోజు. ఎల్బీ స్టేడియం, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, జింఖాన, సరూర్‌ నగర్‌, హెచ్‌సీయూ షూటింగ్‌ రేంజ్‌ వేదికల్లో నేడు ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ముగింపు వేడుకలకు మంత్రులు సబిత ఇంద్రారెడ్డి (గచ్చిబౌలి), శ్రీనివాస్‌ యాదవ్‌(ఎల్బీ స్టేడియం), డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ (జింఖాన గ్రౌండ్స్‌), మండలి స్పీకర్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి (సరూర్‌ నగర్‌) ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ మేరకు ఆరు వేదికల్లో ముగింపు వేడుకల ఏర్పాట్లు, తుది అంకం పోటీలను శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ పర్యవేక్షించారు.

Spread the love