ములుగు జిల్లా పోటీలు ఆరంభించిన శాట్స్‌ చైర్మెన్‌

– జిల్లా స్థాయి సిఎం కప్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : సిఎం కప్‌ 2023 టోర్నీ రెండో అంచె పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీలను సోమవారం 33 జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు ఘనంగా ప్రారంభించారు. మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 85000 మంది గ్రామీణ క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటనున్నారు. మండల స్థాయిలో నిర్వహించిన ఐదు క్రీడాంశాలకు అదనంగా జిల్లా స్థాయి పోటీల్లో మరో ఆరు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా పోటీలను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ ఏటూరు నాగారంలో ప్రారంభించారు. ‘ ములుగు జిల్లాలో ఆరు వేల మంది క్రీడాకారులు సిఎం కప్‌ పోటీల్లో పోటీపడటం గొప్ప విషయం. ఏజెన్సీ ప్రాంతంలో క్రీడలకు అపూర్వ లభించింది. క్రీడలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. సిఎం కప్‌ పోటీల్లో ప్రతిభ చూపిన గ్రామీణ క్రీడాకారులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణతో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లుగా తీర్చదిద్దుతాం. ప్రపంచ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం భార నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది. గ్రామీణ యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని రాణించాలి’ అని ఆంజనేయ గౌడ్‌ అన్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆదిత్య, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ అధికారి అంకిత్‌, అదనపు ఎస్పీ సంకీర్త్‌, డివైఎస్‌ఓ రమణ రాజు, ములుగు స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జింఖానా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలను క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజరు కుమార్‌లు జిల్లాల్లో పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

Spread the love