స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ షురూ!

– మొదలైన సిఎం కప్‌ పోటీలు
– 18 క్రీడాంశాల్లో 33 జిల్లాల క్రీడా
నవతెలంగాణ-హైదరాబాద్‌

తెలంగాణ క్రీడా జాతర మొదలైంది. సిఎం కప్‌ 2023 అంతిమ ఘట్టం, మూడో అంచె పోటీలు ఆదివారం లాంఛనంగా ఆరంభమయ్యాయి. 7500 మంది క్రీడాకారులు.. 18 క్రీడాంశాల్లో 33 జిల్లాలు రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడుతున్నాయి. ఎల్బీ స్టేడియం, జిఎంసి బాలయోగి స్టేడియం, హెచ్‌సియూ షూటింగ్‌ రేంజ్‌, జింఖాన గ్రౌండ్‌, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం, యూసుఫ్‌గూడ్‌ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం పోటీలు మొదలయ్యాయి. ఎల్బీ స్టేడియంలో క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలను ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియ హాకీ పోటీలను ప్రారంభించారు. సోమవారం ఉదయం సెషన్లో 18 క్రీడాంశాల్లో డ్రా, ప్రిలిమినరి రౌండ్‌ పోటీలు నిర్వహించారు. సాయంత్రం సెషన్లో నాకౌట్‌ పోటీలు జరిగాయి.
శాట్స్‌ చైర్మెన్‌ పర్యవేక్షణ : తొలి రోజు పోటీలను శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ పర్యవేక్షించారు. ఎల్బీ స్టేడియం, సరూర్‌ నగర్‌, జింఖాన గ్రౌండ్స్‌, యూసుఫ్‌గౌడ మైదానాలను సందర్శించి మ్యాచులను తిలకించారు. సరూర్‌ నగర్‌లో క్రీడాకారులకు భోజనం వడ్డించి.. మహిళా అథ్లెట్లతో కలిసి భోజనం చేశారు. వసతి, భోజనం, రవాణా, త్రాగునీరు, భద్రత ఏర్పాట్లపై క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు.
నేడు ఆరంభ వేడుకలు : సిఎం కప్‌ 2023 రాష్ట్ర స్థాయి పోటీల ఆరంభ వేడుకలు నేడు జరుగనున్నాయి. ఆరంభోత్సవానికి ఎల్బీ స్టేడియం ఇప్పటికే ముస్తాబైంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆస్కార్‌ వేదికపై మెరిసిన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆరంభ వేడుకల్లో నాటు నాటు ఆలపించనుండగా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ఉత్సాహంగా పోటీలు : తొలి రోజు పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటారు. వాలీబాల్‌లో వనపర్తిపై రంగారెడ్డి 25-11, 25-20తో, భూపాలపల్లిపై మహబూబ్‌నగర్‌ 25-19, 25-17తో, నాగర్‌కర్నూల్‌పై హైదరాబాద్‌ 25-11, 25-17తో విజయాలు సాధించాయి. కబడ్డిలో జగిత్యాలపై నల్గొండ 50-40తో, గద్వాల్‌పై రంగారెడ్డి 47-13, మెదక్‌పై ఖమ్మం 41-05తో గెలుపొందాయి. మెన్స్‌ హాకీలో వనపర్తి, నిజామాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, భద్రాది కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్‌ విజయాలు సాధించాయి. ఫుట్‌బాల్‌లో వనపర్తి, గద్వాల్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కొమురం భీం అసిఫాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు సత్తా చాటాయి.

Spread the love