హయత్‌బక్షి బేగం జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రవీంద్రభారతి సాహిత్య అకాడమీ కార్యాలయంలో గురువారం హయత్‌ బక్షి బేగం జీవిత చరిత్ర పుస్తకాన్ని అంబేద్కర్‌ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మెన్‌, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్‌, ప్రొఫెసర్‌ అస్త్రఫ్‌ రఫీ, రచయిత్రి, ప్రొఫెసర్‌ సుధారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రకు మూలమైన కుతుబ్షాహీ చరిత్ర తెలంగాణ అస్తిత్వానికి ఆయు పట్టు లాంటిదన్నారు. తెలంగాణలో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని రికార్డ్‌ చేయలేదని అన్నారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉనదనీ, చరిత్రను కేవలం చరిత్రకారులు మాత్రమే రికార్డు చేయరని అసలు చరిత్ర ప్రజలలో వారి జీవన విధానంలో ఉంటుందని తెలిపారు. హయత్‌బక్షి భాగమతి కుమార్తె అని వచ్చిన తొలి పుస్తకం ఇది అని అన్నారు. అంబేద్కర్‌ యూనివర్సిటీ ఉపకులపతి సీతారామారావు మాట్లాడుతూ చరిత్ర సత్యాలతో నిండి ఉండాలన్నారు. డెక్కన్‌ సోషల్‌ కల్చరల్‌ జీవన విధానాన్ని ఇంకా వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ చరిత్రలో హిందూ ముస్లింలు ఐక్యత వ్యక్తమవుతున్నదని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ అష్రఫ్‌ రఫీ మాట్లాడుతూ హైదరాబాదుకు ఒక సొంత సంస్కృతి ఉన్నదనీ, ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర ఉందని తెలిపారు. జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి సాహిత్యంతో కలగల్సి ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో సాహిత్యకాడమీ కార్యదర్శి బాలాచారి, తెలంగాణ బుక్‌ ట్రస్ట్‌ ప్రతినిధి కోయ చంద్రమోహన్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, జర్నలిస్టు జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love