బదనామైత…ప్రచారానికి పోను.!

వామ్మో ఆయన ప్రచారానికి నేను పోను. నేను ప్రచారానికి పోయిన తర్వాత ఎన్నికల ఫలితాల్లో ఆయనకు మెజార్టీ తగ్గితే నేను బదనాం అయిత. ఎందుకంటే ఆయన పెట్టిన షరతులు అలా ఉన్నాయి. హుజుర్‌నగర్‌లో 50 వేల మెజార్టీకి ఒక ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆ నియోజకవర్గపు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రజలకు చెబుతున్నారు. దీనిపై మన హన్మంతన్న గాంధీభవన్‌లో సరదాగా స్పందించారు. ‘ఉత్తమ్‌ 50వేల మెజార్టీ గురించి ఎందుకు చెబుతున్నారో, ఆయన్ను ఎవరు అడిగారో, అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి. రేవంత్‌, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని సవాల్‌ విసురుతున్నారేమో తెలియదు కానీ నేనైతే హుజుర్‌నగర్‌ ఎన్నికల ప్రచారానికి పోనంటే పోను’ అని తెగేసి చెబుతున్నారు. ‘నేను ప్రచారానికి పోతే అనుకోని పరిస్థితుల్లో 50 వేల మెజార్టీలో ఒక ఓటు తగ్గినా ఆ ఓటు హనుమంతరావు వల్లే పోయిందంటాడేమో, ఇంకెవరూ ఆయన ఎన్నికల ప్రచారానికి పోయినా మెజార్టీ తగ్గడానికి వారే కారణమంటాడేమో’ అని వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను కూడా హుజుర్‌నగర్‌లో ప్రచారానికి పోవడానికి జంకుతున్నాను. ఎవరు ప్రచారానికి రాకుండా ఉత్తమ్‌ ప్లాన్‌ చేసినట్టున్నాడు. నా వల్ల ఒక ఓటు తగ్గినా ఆ బదనాం నేను మోయలేను. ఇదెక్కడి లొల్లిరా బై…ఊకే ఇంట్లో కూర్చొక.. నాకెందుకు రాబై ఇదంతా…నా వల్ల ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం నాకిష్టం లేదు.’ అంటూ నవ్వులు పూయించారు.
– గుడిగ రఘు

Spread the love