మల్లన్న రూటే.. సపరేటు…

ఇది ఎన్నికల కాలం. నేతల చిత్ర విచిత్ర విన్యాసాలు ఇప్పుడు నిత్యకృత్యం. ఆ విన్యాసాల్లో నటించే వారు కొందరైతే.. జీవించే వారు మరికొందరు. మొత్తం మీద హోటల్‌లో దోశ వేసినా.. వీధుల్లో చీపురు పట్టినా… ఓట్లే లక్ష్యం, గెలుపే వారి గమ్యం. ఈ రకంగా కొనసాగుతున్న ఎలక్షన్‌ ప్రచార ప్రహసనంలో కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి మాత్రం తన దైన స్టైల్‌లో అందర్నీ అలరిస్తున్నారు.. తద్వారా జనాన్ని ఆకర్షిస్తున్నారు. గత కొన్నేండ్ల నుంచి ‘పాలమ్మిన.. పూలమ్మిన…’ అంటూ ప్రత్యేక మేనరిజమ్‌తో, అంతకు మించిన రిథమ్‌తో సభికుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న మల్లన్న… మొన్నటి దసరా వేడుకల్లో సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ మైదానంలో నిర్వహించిన ఆ వేడుకల్లో తాను 1980ల్లో పాలమ్మటం కోసం వాడిన బజాజ్‌ స్కూటర్‌ను బయటకు తీసి.. దాన్ని గ్రౌండ్‌ మొత్తం తిప్పి… ‘ఔరా…’ అనిపించారు. లేటు వయసులో లేటెస్టుగా స్కూటర్‌ మీద రయ్యిరయ్యిన తిరుగుతూ తనకు తానే సాటి అనిపించారు. ఇక నిన్నటికి నిన్న…కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరుతూ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కించారు మన లేబర్‌ మినిష్టర్‌. తన నియోజకవర్గమైన మేడ్చెల్‌లో ఇంటింటికీ, గడప గడపకూ తిరుగుతూ ఓట్లడిగారాయన. ఇందులో కొత్త, వింతేముందని అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. క్యాంపెయిన్‌ సందర్భంగా నేతలు చంటి పిల్లల్ని ఎత్తుకోవటం, వారిని లాలించటం, వారితో ఫొటోలు దిగటం మామూలే. ఇక్కడ మన మల్లన్న కూడా ఒకర్ని ఒళ్లో పడుకోబెట్టుకుని, లాలి పాట పాడారు. ఏడవకు ఏడవకు వెర్రి కన్నా అంటూ జోల కూడా పాడారు. ఆ తర్వాత కారు గుర్తుకు ఓటేయమని అభ్యర్థించారు. కాకపోతే ఆయన అలా ఒళ్లో పడుకోబెట్టుకుని, లాలించింది.. ఓ డెబ్బై ఏండ్ల వృద్ధురాలిని. చుట్టూ ఉన్న జనం ఈ దృశ్యం చూసి ‘నిజంగా మల్లన్న అంటే మల్లన్నే…’ అనుకున్నారట. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. వేలల్లో జనం వీక్షించారు. అదీ మన మినిష్టర్‌ మల్లన్న అంటే…
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love