పారిశ్రామికోత్పత్తి పడక

– మార్చిలో 1.1 శాతమే పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలు పారిశ్రామిక ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. డిమాండ్‌ లేమితో ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. దీంతో అంతిమంగా తయారీపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యం లోనే ప్రస్తుత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగు దల 1.1 శాతానికే తగ్గి.. ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో ఇది 5.6 శాతం వృద్ధిని సాధించింది. 2022-23లో స్థూలంగా 5.1 శాతం పెరుగుదల నమోదు కాగా.. ఇంతక్రితం ఏడాదిలో 2021-22లో ఏకంగా 11.4 శాతం వృద్ధి జరిగింది. దీంతో పోల్చితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తిలో మందగమనం చోటు చేసుకుందని స్పష్టమవుతోంది.
కేంద్ర గణంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం వెల్లడించిన డేటా ప్రకారం.. 2023 మార్చిలో తయారీ రంగం కేవలం 0.5 శాతం పెరుగుదలను మాత్రమే నమోదు చేసింది. గనుల రంగం 6.8 శాతం పెరగ్గా.. విద్యుత్‌ రంగం ఉత్పత్తి 1.6 శాతం తగ్గింది. కన్స్యూమర్‌ డ్యూరెబుల్స్‌ సూచీ వరుసగా నాలుగో మాసంలోనూ పడిపోయింది. ఈ సూచీ మార్చిలో 8.4 శాతానికి తగ్గి.. మూడు నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ”మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 1.1 శాతానికి పడిపోవడం చాలా నిరాశపర్చింది. మేము 3.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశాము. ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగింపు నెల మార్చిలో సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుంది. కానీ.. ఈ సారి అలా జరగలేదు. ఐఐపీ పడిపోవడంతో పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) సూచీలను సమీక్షించాల్సి ఉంటుంది.” అని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనామిస్ట్‌ మదన్‌ సబ్నవిస్‌ పేర్కొన్నారు.
4.7 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 4.7శాతానికి తగ్గింది. దీంతో వరుసగా రెండో మాసంలోనూ ఆర్‌బిఐ అంచనాల కంటే తక్కువగా చోటు చేసుకోవడం విశేషం. గతేడాది ఇదే ఏప్రిల్‌లో ఏకంగా 7.8 శాతం పెరిగింది. 2023 మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 5.66 శాతంగా చోటు చేసుకుంది. 2022-23లో రిటైల్‌ ద్రవ్యో ల్బణం సూచీ 5.2 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. జూన్‌ త్రైమాసికంలో సగటున 5.4 శాతం, క్యూ2లో 5.4 శాతం, క్యూ3, క్యూ4లలో 5.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీని కంటే తక్కువగా చోటు చేసుకోవడంతో కీలక వడ్డీ రేట్లు తగ్గించడానికి వీలుంది.

Spread the love