దక్షిణ లెబనాన్‌పై దాడులు చేపడుతున్న భద్రతా దళాలు : ఇజ్రాయిల్

నవతెలంగాణ – జెరూసలెం: దక్షిణ లెబనాన్‌లో తమ దళాలు ప్రమాదకర దాడులు చేపడుతున్నాయని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ బుధవారం పేర్కొన్నారు. అయితే భూతల దళాలు సరిహద్దును దాటయన్న అంశంపై స్పష్టత నివ్వలేదు. సరిహద్దులో వేలాది మంది భద్రతా దళాలను మోహరించామని, ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు (ఐడిఎఫ్‌) ఇప్పటికే దక్షిణ లెబనాన్‌ వ్యాప్తంగా ప్రమాదకర దాడులను ప్రారంభించాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని నెలల పాటు కొనసాగిన హింసాకాండలో సగం మంది హెజ్బుల్లా కమాండర్లను అంతం చేశామని అన్నారు. సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లారని అన్నారు. దక్షిణ లెబనాన్‌లోని 40 హిజ్బుల్లా లక్ష్యాలను తాకినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. కొద్దిసేపటి క్రితం ఐడిఎఫ్‌ ఫైటర్‌ జెట్‌లు, ఫిరంగి దళాలు దక్షిణ లెబనాన్‌లోని ఐతా అల్‌ -షాబ్‌ సమీపంలోని ఆయుధాలు, నిల్వ సామగ్రి సహా సుమారు 40 హిజ్బుల్లా ఉగ్రవాదుల లక్ష్యాలను చేధించాయని అన్నారు. ఐతా అల్‌ షాబ్‌తో పాటు సమీప గ్రామాల్లో ఇజ్రాయిల్‌ 13కి పైగా వైమానిక దాడులు చేపట్టిందని లెబనాన్‌ జాతీయ మీడియా తెలిపింది. ఐతా అల్‌ షాబ్‌తో పాటు రమ్యా, జబల్‌ బలాత్‌, ఖాల్లెట్‌ వార్దా పట్టణ శివార్లను లక్ష్యంగా చేసుకుని 13కి పైగా ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు దాడులు చేపట్టాయని తెలిపింది. తాము ఎటువంటి సరిహద్దు దాటవేతను గుర్తించలేదని లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళాలు (యుఎనఐఎఫ్‌ఐఎల్‌) ప్రతినిధి తెలిపారు.

Spread the love