మరుగుజ్జులకు కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

–  ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మరగుజ్జు వికలాంగులను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్‌ వెంకటేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2016 ఆర్‌పీడబ్ల్యూడీ కమిషనర్‌ సుమోటగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ అహంకార పూరితంగా మాట్లాడారనీ, వికలాంగుల కు క్షమాపణ చెప్పకపోతే..జిల్లా పర్యటనలలో తమ నిరసనను తెలపాలని సూచించారు. రాజకీయ విమర్శల సందర్భంగా అంగవైకల్యాన్ని కించ పరుస్తూ మాట్లాడటం సంస్కారం కాదని తెలిపారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీల నాయకులను విమర్శిస్తూ ‘సమ ఉజ్జీలతోనే మా పోటీ… మరగుజ్జులతో కాదు’ అంటూ మరగుజ్జు వికలాంగుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం విజ్ఞత కాదని హితవు పలికారు. ఇది కేటీఆర్‌కు పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కూడా అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. చట్టాలను గౌరవించాల్సిన వారే వికలాంగులను కించపరిచే విధంగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల చట్టం – 2016 – సెక్షన 92 (ఎ) ప్రకారం వైకల్యం గల ఏ వ్యక్తినైనా కించపరిచే ఉద్దేశంతో, ఏ స్థలంలోనైనా, బహిరంగంగానైనా ఉద్దేశ పూర్వకంగా అవమానించినా, భయపెట్టినా చట్ట రీత్యా నేరం అవుతుందని గుర్తు చేశారు. వారికి కనీసం ఆరు నెల్లనుంచి ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా వర్తిస్తున్నదని తెలిపారు.

Spread the love