ఏఐఎస్ఎఫ్ 30వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

-ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేల్పుల ప్రసన్న కుమార్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ : ఈ నెల 28 నుండి అక్టోబర్ 1తేదీ వరకు బీహార్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ 30 వ జాతీయ మహాసభల కరపత్రాలను సోమవారం హుస్నాబాద్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులువేల్పుల ప్రసన్న కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేల్పుల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. దేశ విద్య భవిష్యత్తు ప్రపంచ బ్యాంకు రిలయన్స్ అదాని అంబానీ లాంటి ఒప్పందాల్లో వారి కనుసన్నల్లో నడుస్తుందన్నారు. విద్యార్థులను సామ్రాజ్యవాదులకు బానిసలుగా తయారు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాషాయకరణ చేయటానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రముఖుల చరిత్రను, డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించి బ్రిటిష్ వారికి తొత్తుగా వ్యవహరించిన సావర్కర్ చరిత్రను చేర్చి దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. బాల్యం నుంచే విద్యార్థుల మెదడులోకి మతతత్వ భావజాలాన్ని నింపటం ఎంతవరకు సమంజసం మని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, కేంద్రీయ విశ్వవిద్యాలయం, త్రిబుల్ ఐటీ, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ లాంటి అనేక విద్యాసంస్థలను తెలంగాణలో నెలకొల్పకుండా తెలంగాణ విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. భారత దేశ విద్య వ్యవస్థకు చికిత్స చేసి దిశ నిర్దేశం చేయడానికి సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ ఒకటో వరకు బీహార్ రాష్ట్రంలోని బెగుసరై లో 30వ జాతీయ మహాసభలు నిర్వహించినట్లు ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్, ప్రవీణ్, శేఖర్, ప్రణీత, శ్రీజ, జ్యోతి తదితరులు ఉన్నారు.

Spread the love