నాగ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా మన్మథుడు రీ రిలీజ్‌

ఈ నెల 29న అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు. తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇదొక బిగ్‌ అకేషన్‌. ఆయన బర్త్‌డేకి అభిమానులతో పాటు సినీ ప్రియులకు కూడా సర్ప్రైజ్‌ ఇస్తున్నారు. నాగార్జున నటించిన ఎవర్‌గ్రీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన్మథుడు’. నాగర్జున బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం ఈనెల 29న రీ-రిలీజ్‌ కానుంది.
‘మన్మథుడు’లో నాగార్జున ఒక యాడ్‌ ఏజెన్సీ మేనేజర్‌ అభి పాత్రను పోషించారు. ఏవో కారణాల వలన అమ్మాయిలను ఇష్టపడని పాత్రలో అలరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథ, మాటలు అందించగా, కె విజయ భాస్కర్‌ స్క్రీన్‌ ప్లే రాసి, దర్శకత్వం వహించారు ఆహ్లాదకరమైన వినోదం, అందమైన ప్రేమకథ, హదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అద్భుతాలు చేసి, ఆల్‌ టైమ్‌ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు.
ఈ చిత్రంలో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా, అన్షు మరో కథానాయికగా నటించారు. బ్రహ్మానందం, సునీల్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితర హాస్యనటులు అలరించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Spread the love