మోదానీ పాలనకు సమాధి

Mausoleum of Modani rule– కార్పొరేట్‌, మతతత్వ శక్తులను ఓడించి తీరుతాం
– కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటం
– శ్రమజీవుల చారిత్రాత్మక సదస్సు పిలుపు
– అక్టోబర్‌ 3న బ్లాక్‌ డే
– నవంబర్‌లో రాజ్‌ భవన్ల వద్ద మహా పడావ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఉమ్మడిగా పోరాడాలని తీర్మానించాయి. గురువారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల సమాఖ్యల ఉమ్మడి వేదిక, వందలాది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో ”జాతీయ ఐక్యత, సామాజిక సామరస్యం, లౌకిక వాదం పట్ల కార్మికులు, రైతుల నిబద్ధత” నినాదంతో అఖిల భారత కార్మిక, కర్షక సదస్సు జరిగింది. ఈ సదస్సు నాలుగు పేజీల డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ, నిరంకుశ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మోదానీ పాలనను ఓడించడానికి దేశవ్యాప్తంగా విస్తృతమైన పోరాటానికి పిలుపునిచ్చింది. సమస్యలపై ఆందోళనలను ఉధృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. రైతు ఉద్యమం, విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య ఉద్యమం, బీపీసీఎల్‌, సీఈఎల్‌, స్టీల్‌ ప్లాంట్లలో కార్మికుల నిరసనల వంటి ఉమ్మడి పోరాటాల విజయాన్ని గుర్తిస్తూ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను సవాలు చేసేందుకు సమన్వయం పటిష్టంగా ఉండాలని సదస్సు నిర్ణయించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాలకు వ్యతిరేకం గా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, సమస్త శ్రామికులు ఏకం కావాలని కోరుతూ కార్యా చరణను ప్రకటించింది.
సదస్సులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, అఖిల భారత కిసా సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలే, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్‌ కౌర్‌, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు అశోక్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ సిద్ధు (హెచ్‌ఎంఎస్‌), మనాలి షా (సేవా), జి. దేవరాజన్‌ (టీయూసీసీ), శత్రుజీత్‌ (యూటీయూసీ) రమేష్‌ పరాశర్‌ (ఏఐ) యూటీయూసీ) , రైతు నాయకులు జోగీంద్రపాల్‌ సింగ్‌ ఉగ్రహ, యుధ్వీర్‌ సింగ్‌ మాట్లాడారు. హనన్‌ మొల్లా, ఎఆర్‌ సింధు, పి కష్ణప్రసాద్‌, షహనాజ్‌, విఎస్‌ గిరి , బల్దేవ్‌ సింగ్‌ నిహల్‌గడ్‌ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
జాతీయ పిలుపు
2021లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో రైతుల ఆందోళన సందర్భం గా రైతులపై జరిగిన మారణకాండకు సూత్రధారి అయిన కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగిం చాలని కోరుతూ అక్టోబర్‌ 3న నిరసన దినం (బ్లాక్‌ డే) పాటించాలి.
నవంబర్‌ 26 నుంచి 28 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాజ్‌ భవన్ల ఎదుట పగలు, రాత్రి ధర్నా (డే అండ్‌ నైట్‌ మహాపడావ్‌) నిర్వహించాలి.
ఈ ఏడాది డిసెంబర్‌లో, వచ్చే ఏడాది జనవరిలో దేశవ్యాప్త ఐక్య పోరాటానికి సిద్ధం కావాలి.
సదస్సు డిమాండ్లు
ఆహార భద్రతకు హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను యూనివర్సిలైజేషన్‌ చేయాలి.
అందరికీ ఉచిత విద్య, ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం హక్కుకు హామీ ఇవ్వాలి. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి.
పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి.
అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) కఠినంగా అమలు చేయాలి. అటవీ (పరిరక్షణ) చట్ట సవరణలను, బయో డైవర్సిటీ యాక్ట్‌, స్థానికులకు సమాచారం ఇవ్వకుండా అటవీ అనుమతులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. భూమిపై హామీ ఇవ్వాలి.
జాతీయ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆహారం, మెడిసన్‌, వ్యవసాయ ఇన్‌పుట్స్‌, వ్యవసాయ యంత్రాలు వంటి నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌పై సెంట్రల్‌ ఎక్సెజ్‌ డ్యూటీ తగ్గించాలి.
కోవిడ్‌ సాకుతో ఉపసంహరించిన సీనియర్‌ సిటిజన్‌, మహిళలు, వికలాంగులు, క్రీడాకారులు రైల్వే రాయితీలు పునరుద్ధరించాలి.
ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల ప్రయివేటీకరణను ఆపాలి. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ)ను రద్దు చేయాలి. ఖనిజాలు, లోహాల తవ్వకాలపై ప్రస్తుత చట్టాన్ని సవరించాలి. స్థానిక వర్గాలకు ముఖ్యంగా ఆదివాసీలు, రైతుల అభ్యున్నతి కోసం బొగ్గు గనులతో సహా అన్ని గనుల నుండి లాభంలో 50 శాతం వాటాను ఇవ్వాలి.
విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రీ-పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు వద్దు.
పని చేసే హక్కును ప్రాథమికంగా చేయాలి. మంజూరైన పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. ఉపాధి హామీ (ఏడాదికి 200 రోజులు పని, రూ.600 వేతనం) విస్తరించాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి.
రైతులకు విత్తనాలు, ఎరువులు, విద్యుత్‌పై సబ్సిడీని పెంచాలి. రైతులు పండించే అన్ని పంటలకు సి2ం50 శాతం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధ చేయాలి. సేకరణకు హామీ ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి.
కార్పొరేట్‌ అనుకూల పీఎం ఫసల్‌ బీమా యోజనను ఉపసంహరించు కోవాలి. సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమాను ఏర్పాటు చేయాలి. వాతావరణ మార్పు, కరువు, వరదలు, పంట సంబంధిత వ్యాధుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అన్ని పంటలకు బీమా పథకం అమలు చేయాలి.
అన్ని వ్యవసాయ కుటుంబాలను అప్పుల ఊబి నుంచి విముక్తి చేయడానికి సమగ్ర రుణ మాఫీ పథకాన్ని ప్రకటించాలి.
చారిత్రాత్మక కిసాన్‌ పోరాటం సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలి. అమరులైన రైతులందరికీ సింఘూ (ఢిల్లీ-హర్యానా) సరిహద్దులో స్మారక చిహ్నం నిర్మించాలి. పరిహారం చెల్లించి రైతు కుటుం బాలకు పునరావాసం కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఉపసంహరించు కోవాలి. కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాని ప్రాసిక్యూట్‌ చేయాలి.
నాలుగు లేబర్‌ కోడ్‌లు, స్థిర కాల ఉపాధిని ఉపసంహరించుకోవాలి. పనిలో సమానత్వం, భద్రతను అందించాలి.
కార్మికుల క్యాజువలైజేషన్‌ ఆపాలి. అన్ని కేటగిరీల అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్‌ చేయాలి. వారికి పెన్షన్‌తో సహా సమగ్ర సామాజిక భద్రత అందించాలి.
భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ కవరేజీని అందించాలి. సంక్షేమ నిధి నుంచి ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు, ప్రసూతి ప్రయోజనాలు, జీవిత, వైకల్య బీమా ఇవ్వాలి.
గృహ కార్మికులు, గృహ-ఆధారిత కార్మికులపై ఐఎల్‌ఒ ఒప్పందాలను అమలు చేయాలి. తగిన చట్టాలను రూపొందించాలి. వలస కార్మికులపై సమగ్ర విధానాన్ని రూపొందిం చాలి. ఇప్పటికే ఉన్న ఇంటర్‌-స్టేట్‌ మైగ్రెంట్‌ వర్క్‌మెన్‌ (ఉపాధి నియంత్రణ) చట్టం-1979ని బలోపేతం చేయాలి. వారికి సామాజిక భద్రత అందించాలి.
ఎన్‌పీఎస్‌ని రద్దు చేయాలి. ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి. అందరికీ సామాజిక భద్రతను అందించాలి.
సూపర్‌ రిచ్‌పై పన్ను విధించాలి. కార్పొరేట్‌ పన్నును మెరుగుపరచాలి. సంపద పన్ను, వారసత్వ పన్నును మళ్లీ ప్రవేశపెట్టాలి… రాజ్యాంగ విలువలపై దాడిని ఆపాలి. భావప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, మత స్వేచ్ఛ, వైవిధ్యం
8 సంస్కృతులు, భాషలు, చట్టం ముందు సమానత్వం, దేశం సమాఖ్య నిర్మాణం మొదలైన వాటిపై దాడిని ఆపాలి.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పు..
2014 నుంచి కేంద్ర ప్రభుత్వం దూకుడుగా అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల దేశంలో భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఆర్థిక వ్యవస్థలో వినాశకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ ఐక్యత, సమగ్రతకు తీవ్ర ముప్పు ఏర్పడింది.
తపన్‌ సేన్‌
కార్పొరేట్‌ విధానాల వల్ల సంక్షోభంలో వ్యవసాయం..
దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీని ఫలితంగా రైతుల ఆదాయాలు పడిపోతున్నాయి. రైతులలో అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా నేతృత్వంలోని చారిత్రాత్మక 13 నెలల సుదీర్ఘ పోరాటానికి తలవంచిన ప్రభుత్వం రాతపూర్వక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో విఫలమైంది.
అశోక్‌ ధావలే
పెరుగుతున్న నిరుద్యోగం..
పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న ఉద్యోగ భద్రత, నిత్యావసర వస్తువుల ధరలతో కార్మికులు, పేదలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త లేబర్‌ కోడ్‌లతో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. సామాజిక భద్రత కరువై పేదరికంలోకి నెట్టబడుతున్న వ్యవసాయ, వలస కార్మికులు అధ్వాన స్థితిని అనుభవిస్తున్నారు.
అశోక్‌ సింగ్‌
కార్పొరేట్లకు రుణమాఫీ ..
ప్రయివేటీకరణ విధానాలను కేంద్రం తక్షణమే ఆపాలి. సాధారణ ప్రజలపై అధిక పన్నులు వేస్తున్నారు. కార్పొరేట్లకు పన్నులు తగ్గిస్తున్నారు. కార్పొరేట్లకు రుణ మాఫీలు పెరిగాయి. దేశంలో సమాఖ్య నిర్మాణం క్షీణించింది. విభజించే మత విధానాలు, అసమ్మతిని అణిచివేసే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి.
అమర్జీత్‌ కౌర్‌
ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలి
కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలు అమలు చేయాలి. పీఎంఎఫ్‌బీవైను ఉపసంహరించుకోవాలి. అన్ని పంటలకు సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి.
జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌

Spread the love