Monday, May 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు

అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు

- Advertisement -

త్వరలోనే రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇండ్ల మంజూరు :
ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి భరోసా
నవతెలంగాణ-కూసుమంచి

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్‌’లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పారదర్శక పాలనను ప్రజల గడప వద్దకే తీసుకెళ్తున్నామని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా తక్షణ చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్లలో అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును రాజకీయ పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సాదా బైనామా, నిషేధిత జాబితా , భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ బాధ్యతని, ఇందులో ఎలాంటి జాప్యానికి తావులేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని, మే నెలాఖరు నాటికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నా మని తెలిపారు. మే 5 నుంచి 7 వరకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరినాథ్‌ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సైదులు, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -