అత్యధికంగా డొమెస్టిక్ వినియోగదారులే..
గ్రేటర్‌లోనే విద్యుత్ వినియోగం అధికం
విస్తృతంగా పెరిగిన డిస్కం నెట్‌వర్క్
తప్పని అప్రకటిత విద్యుత్ కోతలు
మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గల్లీ నుంచి పారిశ్రామిక వాడల వరకు, పల్లె ముంగిట నుంచి ఐటీ కారిడార్ల వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) వెలుగులు విరజిమ్ముతోంది. రాష్ట్ర పురోగతిలో కీలకంగా మారిన ఈ సంస్థ ప్రస్తుతం 1.17 కోట్ల వినియోగదారులతో అత్యుత్తమ నెట్‌వర్క్‌ను కలిగిన డిస్కంలలో ఒకటిగా నిలిచింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తూ తన పరిధిని విస్తృతంగా పెంచుకుంటోంది. ఒకప్పుడు అరకొర సబ్‌స్టేషన్లతో ఉన్న వ్యవస్థ. నేడు పరిధి విస్తరించింది. కానీ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో డిస్కం వెనుకబడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎస్పీడీసీఎల్ పరిధిలో గృహ అవసరాలకు వినియోగించేవారే సింహభాగంగా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కం ఏఆర్‌ఆర్ సమర్పించే నాటికి మొత్తం కనెక్షన్లలో 73.63 శాతం వాటాతో గృహ వినియోగదారులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అగ్రికల్చర్ వినియోగదారులు 12.78 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. కమర్షియల్ వినియోగదారులు 11.43 శాతం, ఇండిస్టియల్ వినియోగదారులు 0.59 శాతంగా ఉన్నారు. గృహవినియోగదారులు 9,309 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తే, వ్యవసాయానికి 8,273 మిలియన్ యూనిట్లు, కమర్షియల్‌కు 6,163 మిలియన్ యూనిట్లు, ఇండిస్టియల్ వినియోగానికి 12,320 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. వినియోగదారుల సంఖ్య 1.17 కోట్లకు చేరడంతో మెరుగైన విద్యుత్‌కు సరఫరాకు కాస్త అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కువగా వర్షాకాలం, ఎండాకాలంలో డిస్కం వినియోగదారులకు అప్రకటిత విద్యుత్ కోతలు తప్పడం లేదు.
సాయంత్రమే విద్యుత్‌కు అధిక డిమాండ్
గ్రేటర్‌లో మధ్యాహ్నంతో పోలిస్తే.. సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల మధ్యలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదువుతోంది. దీంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు తీవ్ర ఒత్తిడిలోకి నెట్టబడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ వినియో గంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. తరచూ ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
డిస్కం సేవలు 15 జిల్లాల్లో విస్తరణ
ఎస్పీడీసీఎల్ మొత్తం 15 జిల్లాల పరిధిలోని 10 లోక్ సభ స్థానాలు, 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. 21 ఆపరేషన్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం కలిపి 1.17 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. సంస్థ పరిధిలో ప్రస్తుతం 33/11 కేవీ సబ్ స్టేషన్లు 1,808 నిరంతరం సేవలు అందిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు 3,620 పీటీఆర్స్, 6,04,490 డీటీఆర్ప్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ తీగలు ఇప్పుడు ఏకంగా 3,96,900 కిలోమీటర్ల మేర విస్తరించాయి. పెరుగుతున్న జనాభా, విద్యుత్ అవసరాలను అనుగుణంగా డిస్కం నెట్‌వర్క్ కూడా విస్తరిస్తోంది.
గ్రేటర్‌లోనే విద్యుత్ వినియోగం అధికం
గ్రేటర్‌లో 33 కేవీ సబ్‌స్టేషన్లు 498, పీటీఆర్స్ 1,022, డీటీఆర్స్ 1,50,992, విద్యుత్ స్తంభాలు 5,08,271, మొత్తం విద్యుత్ కనెక్షన్లు 63 లక్షలు, 33 కేవీ ఓవర్ హెడ్ లైన్లు 3,725 కిలోమీటర్లు, 11 కేవీ ఓవర్ హెడ్ లైన్లు 21,634 కిలోమీటర్లు, 11 కేవీ యూజ్ కేబుళ్లు 957 కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇక్కడ ఏడాదికేడాది రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. సాధారణంగా మే నెలలో నమోదు కావాల్సిన రికార్డు.. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోనే నమోదైంది. డిస్కం చరిత్రలో అత్యధికంగా 2024 మే 29న 91.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదు కాగా.. 2025లో ఇదే సమయంలో 3,800 మెగావాట్లు మించలేదు.. కానీ ఈ ఏడాది ఇప్పటికే విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.



