ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మంత్రి  సబితా ఇంద్రారెడ్డి

నవతెలంగాణ – మీర్ పేట్
తన రాజకీయ స్వార్థం కోసం మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లెల్లగూడ లలిత నగర్ చౌరస్తా నుండి మీర్ పేట్ మున్సిపల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో వచ్చి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా మీర్ పేట్ కార్పొరేషన్ పన్నుల పెంచడంతో ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే పన్నులు తగ్గిస్తాను అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చి గెలిచి నాలుగు సంవత్సరాలు దాటినా పరిష్కారం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు మార్లు స్థానిక ప్రజల స్థితిగతులపై విన్నవించడం జరిగిందని, పన్నుల భారం వేయమని మంత్రి హామీ ఇచ్చి తుంగలో తొక్కారని విమర్శించారు. కాలనీల సంక్షేమ సంఘాలను పిలుచుకొని పన్నుల తగ్గింపు చేస్తామని మాయ మాటలు చెప్పి మభ్య పెట్టారని అన్నారు. అప్రజా స్వామికంగా ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికల గొంతు నొక్కుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మంత్రి సబితా రెడ్డి ప్రజా వ్యతిరేక తీరుపై విసుగు చెంది రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. సంక్షేమ అభివృద్ధి దివంగత నేత వైఎస్  రాజశేఖర్ రెడ్డి హయాంలోనే, అప్పుడు మంత్రి కాంగ్రెస్ పాట పాడారని, అధికారం కోసం పార్టీ మార్చిన మంత్రి సీఎం కేసీఆర్ వంద పాడుతున్నారని ఆరోపించారు. రాబోయే నాలుగు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని అధికారులు బిఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ప్రజాస్వామ్యము, రాజ్యాంగబద్ధంగా  ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం భావ్యం కాదని సూచించారు. టిఆర్ఎస్, బిజెపిలో రెండు ఒకే గూటి పక్షులని అన్నారు. నాలుగు రోజుల్లో సమస్యలు పరిష్కారం చేయకపోతే కార్యాలయం ముందే నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, మీర్ పేట్ కార్పొరేటర్లు చల్ల కవిత బాల్రెడ్డి, సిద్దాల మౌనిక శ్రీశైలం, ఏడు దొడ్ల సురేందర్ రెడ్డి, ఆవుల యాదయ్య, హైమద్ భామ్, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరకల వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి నిమ్మల వెంకటేష్ గౌడ్, పద్మశ్రీ, అరుణాదేవి, రవీందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కీసర యాదిరెడ్డి, మహిళా సీనియర్ నాయకురాలు గంగమ్మ, ఎరుకల ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మురళి గౌడ్, గిల్లా సుభాష్ రెడ్డి, ఐతరాజు భాస్కర్, పైళ్ల శేఖర్ రెడ్డి, పరుశురాం, ఎన్ ఎస్ యు నాయకులు దీక్షిత్, రంజిత్, గాజుల ఆనంద్, చంద్రమోహన్, కలవకోల్ బాల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love