నవతెలంగాణ హైదరాబాద్: ఉల్లి ధరలపై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ ధరకు ఉల్లి కొనుగోలు చేయలేని వారు కొన్ని నెలలపాటు వాటిని తినకుంటే ఎలాంటి వ్యత్యాసం ఉండదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేసి, దేశీయంగా సరఫరాను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. దాంతోపాటు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉల్లిధరలో ఎలాంటి మార్పులేదు.
‘‘రూ.10 లక్షల విలువైన కారును ఉపయోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధర కంటే రూ.10 – రూ.20 ఎక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ పెరిగిన ధరల ప్రకారం ఉల్లిని కొనుగోలు చేసే స్థోమత లేకపోతే.. రెండు, మూడు నెలలు వాటిని తినకుంటే ఎలాంటి తేడా ఉండదు. కొన్నిసార్లు క్వింటాల్ ఉల్లి ధర రూ.200 పలికితే.. మరికొన్ని సందర్భాల్లో క్వింటాల్ ధర రూ.2,000గా ఉంటుంది. ఈ సమస్య గురించి చర్చించి దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది’’ అని దాదా భూసే అన్నారు. మరోవైపు ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధించిన 40 శాతం సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం నాసిక్ జిల్లాలో ఉల్లి వ్యాపారులు వేలాన్ని నిలిపివేశారు. దేశంలో పెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది.