మా మ్యానిఫెస్టో చూస్తేనే మోడీకి దడ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ‘విప్లవాత్మక’ మ్యానిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారని ఆ పార్టీ నాయకులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సులో గాంధీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో మీకు నచ్చిందా? ప్రధాని మోడీ భయాందోళనకు గురికావడం మీరు చూస్తున్నారు. ఇది ఒక విప్లవాత్మక మ్యానిఫెస్టో’ అని రాహుల్‌ అన్నారు. ఎన్నికల సభల్లో అబద్ధాలు చెప్పడం ద్వారా చరిత్ర మారదని రాహుల్‌ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను కార్పొరేట్లు, కోటీశ్వర్లుకు బదిలీ చేసిందని, ఆ డబ్బులో కొంత మొత్తాన్ని అట్టడగున ఉన్న పేదలకు తిరిగి పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చెబుతుందని రాహుల్‌ వివరించారు. మోడీ కేవలం 22 మందికి ఇచ్చిన 16 లక్షల కోట్లు రూపాయలను దేశంలోని 90 శాతం ప్రజలకు కాంగ్రెస్‌ తిరిగి ఇస్తుందని రాహుల్‌ చెప్పారు. దేశంలో ధనవంతుల జాబితాలో ఒబిసి వారు ఎవ్వరూ లేరని గాంధీ గుర్తు చేశారు. ‘కుల గణన నాకు రాజకీయం కాదు. నా జీవిత లక్ష్యం’ అని రాహుల్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కులగణన నిర్వహిస్తామని మరోసారి ఆయన హామీ ఇచ్చారు.

Spread the love