కేంద్రం తీరుపై తమిళ రైతుల ఆగ్రహం

కేంద్రం తీరుపై తమిళ రైతుల ఆగ్రహం– పంట ధరలపై ఢిల్లీలో ధర్నా
– చనిపోయిన అన్నదాతల పుర్రెలు, ఎముకలతో నిరసన
– డిమాండ్లు నెరవేర్చకపోతే వారణాసిలో మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ : పంటల ధరలు, నదుల అనుసంధానంపై కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తమిళనాడుకు రైతులు దేశరాజధాని న్యూఢిల్లీలో ఆందోళనకు దిగారు. సుమారు 200 మంది రైతులు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలిపారు. ఆందోళనకారులు.. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలను తీసుకెళ్లి నిరసనలో ప్రదర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ సర్కారు హామీ ఇచ్చినా.. పంటలకు మాత్రం ధరలు పెంచటం లేదని రైతులు ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో పంటల లాభాలను రెట్టింపు చేస్తామనీ నదులను అనుసంధానం చేస్తామని ప్రధాని ప్రకటించారని నేషనల్‌ సౌత్‌ ఇండియన్‌ రివర్‌ ఇంటర్‌లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యకన్ను ఒక ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వినకుంటే వారణాసి వెళ్లి మోడీపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆందోళనకారులు తెలిపారు.
తమ డిమాండ్ల కోసం తాము ఇంతకు ముందు కూడా నిరసన తెలిపామని గుర్తు చేశారు. ”మేము ప్రధానికి వ్యతిరేకం కాదు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం కలిగి లేము. మాకు ప్రధాని సహాయం కావాలి” అని అయ్యకన్ను అన్నారు. ముందుగా తమను నిరసనకు అనుమతించలేదనీ, తర్వాత కోర్టు నుంచి అనుమతి పొందామని రైతులు ఆరోపించారు. ”మనం ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాం. నిరసన తెలిపే హక్కు మాకు ఉన్నది. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు” అని రైతు నాయకుడు అన్నారు. తమిళనాడుకు చెందిన రైతులు గతంలోనూ జంతర్‌ మంతర్‌ వద్ద ఇదే తరహాలో నిరసనలు చేపట్టారు. పుర్రెలు, ఎముకలతో రైతులు చేపట్టిన ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.a

Spread the love