ఓడిస్తారనే కాంగ్రెస్‌ ప్రమాణాలు

ఓడిస్తారనే కాంగ్రెస్‌ ప్రమాణాలు– నాలుగు నెలల పాలనలో ముఠా రాజకీయాలు.. తిట్లు
– నామినేషన్‌ గడువు ముగుస్తున్నా అభ్యర్థిని ప్రకటించలేని స్థితి
– నామను గెలిపిస్తే నెత్తినున్న కాంగ్రెస్‌ కండ్లు దిగుతాయి
– మోడీకి భయపడే మంత్రివర్గంలో మైనార్టీకిి నో చాన్స్‌ : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నామినేషన్‌ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తుక్కు తుక్కుగా ఓడిస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవునిపై ప్రమాణాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తున్నా అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఆ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. నాలుగు నెలల పాలనలో ముఠా రాజకీయాలు.. తిట్లు తప్ప మరేవీ లేవన్నారు. రేవంత్‌రెడ్డి.. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు నామినేషన్‌ సందర్భంగా బుధవారం స్థానిక సీక్వెల్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ముఖ్యనాయకుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఖమ్మం ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడుతుంటే వీరు మాత్రం టిక్కెట్ల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. జిల్లాలో నీటి ఎద్దడి రావద్దనే తమ పాలనలో సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించామన్నారు. కాంగ్రెస్‌ వస్తే మార్పు వస్తుందనుకుంటే ఈ జిల్లాలో ముగ్గురికే నౌకరీ వచ్చిందన్నారు. నెత్తికెక్కిన కాంగ్రెస్‌ కండ్లు దిగాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించాలని పిలుపునిచ్చారు.
‘బస్సు’ తప్ప మిగతావన్నీ తుస్సే..!
కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నీ విస్మరించింది.. ఒక్క ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతావన్నీ తుస్సే అని హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి రాగానే రూ.4వేలు ఇస్తామన్న పింఛన్‌ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 ఇస్తా అన్నారు.. ఆ మేరకు ఒక్కో మహిళకు కాంగ్రెస్‌ రూ.10వేల బాకీ పడిందని తెలిపారు.
రేవంత్‌ వచ్చాక రాష్ట్రంలో లక్ష పెండ్లిళ్లు అయ్యాయి. ఆ వధువులందరికీ లక్ష తులాల బంగారం ఈ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గడగడపకు వెళ్లండి.. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరన్నారు. మోడీకి భయపడే రేవంత్‌ తన క్యాబినెట్‌లో మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదని గమనించాలన్నారు. లంబాడీలు సైతం నిర్లక్ష్యానికి గురయ్యారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఎంపీ టిక్కెట్‌ కూడా మాదిగలకు కేటాయించ లేదన్నారు. తనను తాను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా చెప్పుకునే రేవంత్‌ ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రజాపాలన అన్న సీఎం ఒక్కరోజు ప్రజలను కలిసి ఆ తర్వాత గేట్లు మూయించారని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమైతే కవిత జైల్లో ఉండేది కాదు
– మాజీ మంత్రి పువ్వాడ, వద్దిరాజు, నామ
పథకాలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతోందని మరో మాజీ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలనే కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్‌ఎస్‌ బీజేపీకి ఎప్పుడూ బీ టీమ్‌గా లేదు.. అలా ఉంటే కవిత జైల్లో ఉండేవారు కాదన్నారు. అందరం కలిసి మే 13 వరకు కష్టపడాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, జెడ్పీ చైర్మెన్‌ లింగాల కమల్‌రాజ్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Spread the love