నవతెలంగాణ-శంకర్‌పల్లి
తెలంగాణ కేంద్రంగా ప్రపంచ దేశాలకు రైల్వే బోగీలను ఎగుమతి చేయబోతున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ నెల 22 న సీఎం కేసీఆర్‌తో ప్రారంభించనున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం శంకర్‌పల్లి మండలంలోని కోండకల్ గ్రామంలో గురువారం సీఎం కేసిఆర్‌తో ప్రారంభం కానున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభ ఏర్పాట్లను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కక్ష పూరితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయపరంగా ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై, కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు పార్లమెంట్‌లో ప్రశ్నించినా స్పందన లేదన్నారు. కేంద్ర సహకరించకున్నా, మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వారికి రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించి, నేడు ప్రపంచానికే ఎగుమతి చేసే స్థాయి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ కేంద్రమైందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు జాతీయ హౌదా ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కనీసం ఎన్నికల ముందైనా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లకు జాతీయ హౌదా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్ నహిముద్దీన్, కొండకల్ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, శేరిగూడ గ్రామ ఉపసర్పంచ్ ఇంద్రాసేనారెడ్డి, రైల్వే కోచ్ అధికారులు తదితరులు ఉన్నారు.