ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు

– ఓటు కూడా వేయొచ్చు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : షెడ్యూల్డ్‌ తెగల సభ్యులు కాని పౌరులు సహేతుకమైన పరిమితులకు లోబడి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో స్థిరపడవచ్చని సుప్రీంకోర్టు వివరించింది. అలాంటి పౌరులకు ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. షెడ్యూల్డ్‌ తెగల ఆర్థిక, సాంస్కతిక ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరమున్న ప్రాంతాలను గుర్తించే అధికారాన్ని ఐదో షెడ్యూల్‌ రాష్ట్రపతికి ఇస్తుంది. ప్రస్తుతం, పది రాష్ట్రాలు ఐదో షెడ్యూల్‌ ప్రాంతాలను కలిగి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లు ఉన్నాయి. ఆదివాసీస్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ యాక్షన్‌ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈనెల 10న తీర్పు వెలువరించింది. ఆదివాసీయేతర పౌరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసించే హక్కు ఉందని ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సంస్థ సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వు1977 నుంచి షెడ్యూల్డ్‌ ఏరియాగా ఉన్న సుందర్‌గఢ్‌ జిల్లాకు సంబంధించినది. ”భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19లోని క్లాజ్‌ (1)లోని సబ్‌క్లాజ్‌ (ఇ) ప్రకారం, ప్రతి పౌరుడికి భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి హక్కు ఉంది” అని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌ ఓకా, జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ”అయితే, ఒక చట్టం చేయడం ద్వారా ఆర్టికల్‌ 19లోని క్లాజ్‌ (5)లో అందించిన విధంగా పేర్కొన్న ప్రాథమిక హక్కుపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. కాబట్టి, గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో స్థిరపడే హక్కు లేదనే వాదనను మేము తిరస్కరించాం ” అని వివరించింది.ఐదో షెడ్యూల్‌ను పార్లమెంటు ఆమోదించిన చట్టం అని సంస్థ చేసిన వాదనను బెంచ్‌ తప్పుగా భావించింది. ”ఐదో షెడ్యూల్‌ ఒక చట్టం అని భావించినప్పటికీ, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1) ప్రకారం ప్రాథమిక హక్కుల సాధనపై ఎలాంటి పరిమితులనూ విధించదు” అని వివరించింది.

Spread the love