అవగాహనతోనే ఆచరణ..

ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. అందుకోసం డైటింగ్‌ పేరుతో చేయకూడనివి చేస్తుంటారు. ఇవి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. సన్నగా అవ్వాలన్న ఆరాటంలో చేసే పొరపాట్లు తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఫిట్‌గా ఉండాలంటే డైటింగ్‌ పట్ల సరైన అవగాహన ఏర్పరుచుకుని అవలంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలా డైట్‌ ఫాలో అవ్వాలంటే…

 డైటింగ్‌ చేయాలనుకుంటే ముందుగా డాక్టర్‌ని తప్పక సంప్రదించాలి. ఎంత బరువున్నారు? ఎంత తగ్గాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? ఏమేం తినాలి?… ఇలా ప్రతి ఒక్కటీ డాక్టర్‌ని అడిగి సలహా తీసుకోవాలి. ఎందుకంటే కొందరి శరీరం కొన్ని రకాల వ్యాయామాలను తట్టుకోలేకపోవచ్చు. కొన్ని రకాల ఆహారం కొందరికి మేలు చేయకపోవచ్చు. అందుకే ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారు డైట్‌ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకే డాక్టర్‌ సలహా తప్పనిసరి.
త్వరగా బరువు తగ్గిపోవాలన్న ఆతృతతో ఒకేసారి ఎక్కువ డైటింగ్‌ చేసేస్తుంటారు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఏదైనా మెల్లగా మొదలు పెట్టి పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారిగా ఆహారపు అలవాట్లు మార్చేస్తే నీరసం వచ్చేస్తుంది. డైటింగ్‌ అంటే మరీ కడుపు మాడ్చేసుకోనవసరం లేదు. బలవర్ధకమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడమే డైటింగ్‌. ఘనాహారాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ద్రవాహారాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. అలాగే కొన్ని రకాల ఫ్యాట్స్‌ ఆరోగ్యానికి మంచిది. వాటిని చెడు చేసే ఫ్యాట్స్‌ అనుకుని పొరబడి తినకుండా ఉండకండి. ఏది తినాలో ఏది తినకూడదో ముందు తెలుసుకోవాలి.
కొన్నిసార్లు ఎంత డైటింగ్‌ చేసినా బరువు తగ్గరు. అలాంటప్పుడు డైట్‌ ప్లాన్‌ చేంజ్‌ చేసుకోవాలే తప్ప వాటినే తింటూ ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు బరువు పరిశీలించుకుంటూ ఉంటే ప్లాన్‌ చేంజ్‌ చేయాలా లేదా అన్నది తెలుస్తుంది. కొందరైతే ఆహారం తగ్గించేసి ప్రొటీన్‌ షేక్స్‌, విటమిన్‌ ట్యాబ్లెట్లూ వేసేసుకుంటూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయవద్దు. ఆహారాన్ని ఏదీ రీప్లేస్‌ చేయలేదన్న విషయాన్ని మర్చిపోకండి.
చాలామంది చేసే తప్పేంటంటే… డైటింగ్‌ పేరుతో అన్నీ కంట్రోల్‌ చేసేస్తారు. ఆ తర్వాత దేనికో టెంప్ట్‌ అయ్యి తినేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఎక్కువ చెడు జరిగే అవకాశాలున్నాయి. తినకూడదు అనుకున్న వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. ఫ్రెండ్స్‌ బలవంత పెట్టారనో, ఇంట్లో పార్టీ ఉందనో కాంప్రమైజ్‌ అయిపోవద్దు. లేదంటే డైట్‌ కంట్రోల్‌ చేసి ఉపయోగం ఉండదు. దీని వల్ల ఎంత మెల్లగా బరువు తగ్గుతారో అంత వేగంగా పెరుగుతారు.
ఇక అన్నిటికంటే ముఖ్యమైనది విశ్రాంతి, నిద్ర. డైటింగ్‌ చేసేవాళ్లకు కచ్చితంగా విశ్రాంతి ఉండాలి. నీరసంగా ఉందని ఒళ్లు మొరాయిస్తున్నా వ్యాయామం చేసేయడం, తిండి తినకుండా పని చేసేయడం వంటివి చేయకండి. అంతేకాదు… కంటికి సరిపడా నిద్రపోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నిజంగా ఫిట్‌గా ఉండాలంటే ఈ తప్పులేవీ చేయకూడదు. డైటింగ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. తర్వాత బాధపడాల్సి వస్తుంది.

Spread the love