సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌

 కర్నాటక డిజీపీకి దక్కిన పదవి..  బీజేపీకి కొమ్ముకాస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
 ఫలితాలు రాగానే కర్నాటక నుంచి సీబీఐ బాస్‌గా పదోన్నతి..
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి డైరెక్టర్‌గా కర్నాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ పదవీ విరమణ అనంతరం ప్రవీణ్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాని మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం సమావేశమైంది. కర్నాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌, మధ్యప్రదేశ్‌ డీజీపీ సుధీర్‌ సక్సేనా, తాజ్‌ హాసన్‌లను ఈ పదవి కోసం ఎంపిక చేసింది. చివరికి ప్రవీణ్‌ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమించింది.
ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ రెండేండ్ల పదవీ కాలం మే 25తో ముగుస్తుంది. ఆయన తరువాత ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. సీబీఐ డైరెక్టర్‌ పదవిలో నియమితులైనవారి పదవీ కాలం రెండేండ్లు ఉంటుంది. ఆ తరువాత ఐదేండ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. ప్రవీణ్‌ కర్నాటక కేడర్‌ 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుతం కర్నాటక డీజీపీగా పని చేస్తున్నారు. ఆయనపై ఇటీవల కర్నాటక కాంగ్రెస్‌ నేత డికె శివ కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్‌ నేతలపై కేసులు పెడుతున్నారని, బీజేపీని కాపాడుతున్నారని, ఆయనను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆ రాష్ట్ర డీజీపీని అత్యున్నత కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఒకటైన సీబీఐ డైరెక్టర్‌గా నియమించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Spread the love