రీ- రిలీజ్‌కి రంగం సిద్ధం

తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్‌ హిట్‌గా నిలిచిన ‘తొలిప్రేమ’ ఈ ఏడాదితో దిగ్విజయంగా 25 వసంతాలు పూర్తి చేసుకుంది. పవన్‌ కళ్యాణ్‌, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.సి. ఆర్ట్స్‌ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది.
ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4కె ఫార్మెట్‌లో దీన్ని రిలీజ్‌ చేేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్‌ వారు ఈ చిత్రాన్ని ఈనెల 30న 300కి పైగా థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ-రిలీజ్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది.
నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ, ”తొలిప్రేమ అనేది ఒక గొప్ప జ్ఞాపకం. నా సినీ ప్రయాణంలో ఈ సినిమాకి ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నాకు అడుగులు నేర్పించిన సినిమా ‘తొలిప్రేమ” అని అన్నారు. దర్శకుడు కరుణాకరన్‌ మాట్లాడుతూ, ‘ఈ ఒక్క చిత్రం నా జీవితాన్ని మార్చేసింది’ అని తెలిపారు. ‘తొలిప్రేమ సినిమా మాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా రీరిలీజ్‌ చేస్తున్న రఘురాం రెడ్డి, రవికాంత్‌ రెడ్డికి ఆల్‌ ది బెస్ట్‌’ అని నిర్మాత జి.వి.జి.రాజు చెప్పారు. శ్రీ మాతా క్రియేషన్స్‌ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.

Spread the love