నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లీ మండల కేంద్రంలో జొన్న పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతులు సోమవారం తహశీల్దార్ రంజిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో రైతులు పెద్ద ఎత్తున జొన్న పంట సాగు చేశారు.
జొన్న సాగు వివరాలు: మొత్తం సాగు విస్తీర్ణం 1325 ఎకరాలు. అంచనా దిగుబడి 2650 టన్నులు, ప్రస్తుతం మా మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం లేని కారణంగా, రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మద్నూర్ మార్కెట్ కమిటీకి తీసుకెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రైతులపై అదనంగా సుమారు రూ. 53,00,000/- (అక్షరాల యాభై మూడు లక్షల రూపాయలు) రవాణా ఖర్చు, హమాలీ ఛార్జీలు, సమయం వృథా రూపంలో భారం పడుతోంది. చిన్న, సన్నకారు రైతులకు ఇది చాలా కష్టంగా ఉంది. దూర ప్రాంతాలకు పంట తరలించే క్రమంలో నష్టాలు కూడా వస్తున్నాయి. కావున, తమరు దయచేసి మా రైతుల సమస్యను, ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని, డోంగ్లీ మండల కేంద్రంలోనే ప్రభుత్వ జొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయించి రైతులను ఆదుకోవలసిందిగా రైతులు తహశీల్దార్ కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.



