శతక జైస్వాల్‌

Shataka Jaiswal– ఛేదనలో యశస్వి అజేయ సెంచరీ
– ముంబయిపై రాజస్థాన్‌ ఘన విజయం
– ముంబయి 179/9, రాజస్థాన్‌ 183/1
నవతెలంగాణ-జైపూర్‌
రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ 17లో ఏడో విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (104 నాటౌట్‌, 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. సంజు శాంసన్‌ (38 నాటౌట్‌, 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్‌ జోశ్‌ బట్లర్‌ (35, 25 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించగా.. యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌ రెండో వికెట్‌కు అజేయంగా 109 పరుగుల భాగస్వామ్యంతో చెలరేగారు. దీంతో 18.4 ఓవర్లలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ 183 పరుగులు చేసి లాంఛనం ముగించింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ సందీప్‌ శర్మ (5/18) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించినా.. తెలుగు తేజం తిలక్‌ వర్మ (65, 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కటంతో ముంబయి ఇండియన్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. నెహల్‌ వదెరా (49, 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్‌ (1/48) ఐపీఎల్‌ చరిత్రలో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
నువ్వా.. నేనా : సొంతగడ్డ జైపూర్‌లో టాస్‌ ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలుత బౌలింగ్‌కు వచ్చింది. గత మ్యాచ్‌లో ముంబయికి బంతితో చుక్కలు చూపించిన రాయల్స్‌ పేసర్లు.. మరోసారి ఆ జట్టును భయపెట్టారు. ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మ విజృంభించటంతో టాప్‌-3 బ్యాటర్లు రోహిత్‌ శర్మ (10), ఇషాన్‌ కిషన్‌ (0), సూర్యకుమార్‌ యాదవ్‌ (10) 20 పరుగులకే డగౌట్‌కు చేరుకున్నారు. పవర్‌ప్లే మధ్యలోనే కీలక బ్యాటర్లను కోల్పోయిన ముంబయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో తిలక్‌ వర్మ (65), మహ్మద్‌ నబి (23) ముంబయిని ఆదుకున్నారు. పవర్‌ప్లేలో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించారు. ఆరు ఓవర్ల అనంతరం 45/3తో నిలిచిన ముంబయి స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ తిలక్‌ వర్మ షోతో ఆ జట్టు బలంగా పుంజుకుంది. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు సంధించిన తిలక్‌ వర్మ 38 బంతుల్లో స్ఫూర్తిదాయక అర్థ సెంచరీ సాధించాడు. మహ్మద్‌ నబి నిష్క్రమించినా.. నెహల్‌ వదేరాతో కలిసి జోరు కొనసాగించాడు. తిలక్‌ వర్మ, నెహల్‌ మెరుపులతో ముంబయి ఊపందుకుంది. 15.5 ఓవర్లలో 150 పరుగుల మార్క్‌ అందుకుంది. దీంతో 200 పరుగులు సాధ్యమే అనిపించింది. కానీ డెత్‌ ఓవర్లలో రాయల్స్‌ బౌలర్లు మరోసారి ఆకట్టుకున్నారు. వరుస వికెట్లతో ముంబయిని దెబ్బకొట్టారు. తిలక్‌ వర్మ, నెహల్‌ నిష్క్రమణ తర్వాత హార్దిక్‌ పాండ్య (10), టిమ్‌ డెవిడ్‌ (3), గెరాల్డ్‌ (0) నిరాశపరిచారు. చివరి 18 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన ముంబయి 18 పరుగులే చేసింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులకే పరిమితమైంది.

Spread the love