ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్న సునీతా కేజ్రీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో… ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ వారాంతంలో ఆమె దేశరాజధానిలో రోడ్డు షోలు నిర్వహించే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత నెలలో ఆయన అరెస్టయ్యారు. ఆయన జ్యుడీషియల్ రిమాండ్ మే 7వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. దీంతో సునీత ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుల్దీప్ కుమార్‌కు మద్దతుగా కొండ్లిలో ఈ వారాంతంలో సునీతా కేజ్రీవాల్ మొదటి రోడ్డు షో నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న ఇతర లోక్ సభ స్థానాల్లో కూడా ఆమె ర్యాలీలు నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు, కాంగ్రెస్ మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ; నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. సునీతా కేజ్రీవాల్ ఢిల్లీతో పాటు గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు. గుజరాత్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.

Spread the love