జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

నవతెలంగాణ హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్‌ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్‌టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ సైతం ప్రకటించింది. 100 పర్సంటైల్‌ సాధించినవారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. ఫలితాలతోపాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు, కటాఫ్‌ను వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతలుగా నిర్వహించారు. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్‌ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 8,22,899 మంది పరీక్షలకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్‌లో విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్‌కు జాతీయస్థాయిలో 9వ ర్యాంకు లభించగా, కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవారెడ్డికి జాతీయస్థాయిలో 14, ఈడబ్ల్యుఎస్‌లో మొదటి ర్యాంకు వచ్చాయి. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డికి జాతీయస్థాయిలో 20వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌లో మూడో ర్యాంకు లభించాయి. ఇదే జిల్లాకు చెందిన తోటంశెట్టి నిఖిలేష్‌కు జాతీయస్థాయిలో 21వ ర్యాంకు లభించింది.

Spread the love