ముగిసిన సీఎం కప్‌ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన పోటీల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 క్రీడా విభాగాల్లో తలపడ్డ ప్లేయర్లు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ సత్తాచాటారు. జిల్లా కేంద్రాలు వేదికలుగా జరిగిన సీఎం కప్‌లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పతకాలు కొల్లగొట్టారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన ప్లేయర్లు ఈ నెల 29 నుంచి మొదలయ్యే రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడనున్నారు. పోటీలకు ఆఖరి రోజైన బుధవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ ఠాగూర్‌ స్టేడియంలో జరిగిన పోటీలకు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలికితీసేందుకు సీఎం కప్‌ నిర్వహిస్తున్నాం. ఊహించిన దాని కంటే ఎక్కువగా జిల్లా స్థాయి టోర్నీలో ప్లేయర్లు పోటీపడ్డారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చాటారు. రాష్ట్ర స్థాయి టోర్నీలోనూ ఇదే పంథా కొనసాగించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్‌ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, గీత సహకార సంస్థ చైర్మన్‌ రవికుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్‌ టోర్నీని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరిగే సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ నేపథ్యంలో బుధవారం సచివాలయంలో సుల్తానియా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆరు స్టేడియాల్లో పోటీపడే ప్లేయర్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

Spread the love