పెండ్లింట పెను విషాదం.. వడదెబ్బతో వరుడి దుర్మరణం

నవతెలంగాణ – కుమురం భీం ఆసిఫాబాద్
తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. మరికొద్ది గంటల్లో పెండ్లనగా వరుడు వడదెబ్బ బారిన పడి మృతి చెందడంతో పెండ్లింట పెను విషాదం అలుముకుంది. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్-యశోద దంపతుల పెద్ద కుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెండ్లి కుదిరింది. బుధవారం పెండ్లి ముహూర్తం కాగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే, పెండ్లిపనుల్లో బిజీగా ఉన్న తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో, కుటుంబసభ్యులు తొలుత అతడిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మంచిర్యాలలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెండ్లనగా తమ పెద్దకుమారుడు ఇలా అనూహ్యంగా మరణించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Spread the love