ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

నవతెలంగాణ న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్‌ డే (Republic Day) వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది. కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ ఉదయం జాతీయ వార్‌ మెమోరియల్‌ను ప్రధాని మోడీ సందర్శించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40ఏండ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ఈ బగ్గీని వినియోగించారు. కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత పరేడ్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ‘ఆవాహన్‌’తో పరేడ్‌ను మొదలుపెట్టారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.

Spread the love